- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం హామీకి రెండేళ్లు.. నేటికీ ఎదురు చూపులే..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కోసం ప్రజలు ఎదురుచూపులు తప్పడం లేదు. నాలుగేళ్ల కిందట కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయగా, మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు అలానే ఉన్నాయి. ఇప్పటికే సర్కారుకు వీటి ప్రతిపాదనలు చేరగా, స్వయంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు పూర్తయినా నెరవేరలేదు. నిర్మల్ జిల్లాలో రెండు కొత్త మండలాల ఏర్పాటుపై ఇటీవల మళ్లీ ప్రతిపాదనలు కోరగా మిగతా వాటిపై స్పష్టత లేదు. కొత్త డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేస్తారా? లేదోననే చర్చ మొదలైంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 2016 అక్టోబర్ 11న పునర్విభజన చేసి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ 4 జిల్లాలు ఏర్పాటు చేశారు. గతంలో ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల 5 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా భైంసా, కాగజ్ నగర్, బెల్లంపల్లి 3 డివిజన్లు ఏర్పాటు చేయటంతో డివిజన్లు 8కి చేరాయి. దీంతో ప్రస్తుతం ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్ల చొప్పున ఉన్నాయి. గతంలో 52 మండలాలు ఉండగా కొత్తగా 18మండలాలు ఏర్పాటు చేయటంతో వీటి సంఖ్య 70కి చేరింది. ఆదిలాబాద్ జిల్లాలో 5, నిర్మల్ జిల్లాలో 6, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3, మంచిర్యాల జిల్లాలో 4 కొత్త మండలాలు ఏర్పాటు చేశారు.
కలగానే బెల్తరోడా కొత్త మండలం
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడాను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో మెజారిటీ గ్రామాలున్నాయి. బామ్ని తండా నుంచి ఎల్వత్ చాలా దూరంలో ఉండగా విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉంటుంది. గతంలో 20 జీపీలుండగా, కొత్తగా 11 ఏర్పాటు చేయటంతో 31కి చేరాయి. కుభీర్ మండలంలో గతంలో 20 జీపీలుండగా కొత్తగా 21ఏర్పాటు చేయటంతో 41కి చేరాయి. తానూర్, కుభీర్ మండలాల్లోని గ్రామాలను కలిపి బెల్తరోడాను కొత్త మండలంగా ఏర్పాటు విషయంలో గతంలో ప్రతిపాదనలు కోరారు. తాజాగా ప్రభుత్వం కోరిన ప్రతిపాదనల్లో బెల్తరోడా ప్రస్తావన లేదు.
మోక్షం కలిగేనా..
జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు తర్వాత మరికొన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో తానూర్ మండలం బెల్తరోడా లేదా కుభీర్ మండలం మాలేగాం, సారంగపూర్ మండలం బీరవెల్లి, మామడ మండలం పొన్కల్, లక్షమణచాంద మండలం వడ్యాల్, మామడ మండలం వెంకటాపూర్, కడెం మండలం లింగాపూర్, ఆదిలాబాద్ జిల్లా సోనాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పార్పెల్లి, హాస్నాదలను కొత్త మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. కోటపల్లి విస్తీర్ణం పరంగా పెద్దగా ఉండటంతో మూడు మండలాలుగా విభజించాలనే డిమాండ్ ఉంది. రెండేండ్లుగా ప్రతిపాదనల్లో ఎలాంటి కదలిక లేదు.
బెల్తరోడాను మండలం చేయాలి
-పట్టేపూర్ మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముధోల్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన మేరకు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలి. ఖానాపూర్, బోథ్, చెన్నూర్ డివిజన్లతో పాటు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి. తానూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. చాలా గ్రామాలకు రవాణా వసతి లేదు. ఆటోలు, ద్విచక్ర వాహనాలపై మండల కేంద్రానికి వస్తారు. బెల్తరోడాను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలి.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
-తుల శ్రీనివాస్, ఎంపీపీ, బోథ్
సోనాల కొత్త మండలం ఏర్పాటు కోసం ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేశాం. అధికారులు సాధ్యమైనంత త్వరగా సోనాల మండలం ఏర్పాటు చేయాలి. సోనాల మండలం ఏర్పాటు చేస్తారని సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల, ఎమ్మెల్యే బాపురావుపై నమ్మకం ఉంది. మండలం ఏర్పాటు చేయకుంటే గ్రామస్తులతో చర్చించి ఆమరణ నిరాహార దీక్ష చేపడతా.
బెల్తరోడా మండలం చిరకాల వాంఛ
-సాయినాథ్, సర్పంచ్, బెల్తరోడా
తానూర్ మండలం విస్తీర్ణంతో పాటు గ్రామ పంచాయతీల పరంగా పెద్దది. బెల్తరోడాను మండలంగా ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ఇప్పటికే మండల ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదనలు వెళ్లాయి. కుభీర్, తానూర్ మండలంలోని ఆయా గ్రామాలతో కలిపి బెల్తరోడా కొత్త మండలం ఏర్పాటు చేయాలి.