ఎమ్మీ అవార్డు రేసులో ‘ఢిల్లీ క్రైమ్, ఫోర్ మోర్ షాట్స్’

by Shyam |
ఎమ్మీ అవార్డు రేసులో ‘ఢిల్లీ క్రైమ్, ఫోర్ మోర్ షాట్స్’
X

దిశ, వెబ్‌డెస్క్: వెండితెర నటీనటులకు గుర్తింపుతో పాటు వారి నటనకు ప్రశంసగా ఎన్నో అవార్డులు ఇస్తుంటారు. ఫిల్మ్‌ఫేర్, నంది, గ్రామీ, ఆస్కార్ వంటి అవార్డులు ఈ కోవకు చెందినవే. ఇవే కాక ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా సీరియల్స్, వెబ్ సిరీస్‌లు కూడా రూపొందుతున్నాయి. ఈ బుల్లితెర నటీనటుల ప్రతిభను గుర్తిస్తూ ‘ఎమ్మీ అవార్డ్స్’ అందజేస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ అవార్డులకు మన దేశం నుంచి కూడా ప్రస్తుతం మూడు వెబ్‌సిరీస్‌లు చోటు దక్కించుకోవడం విశేషం.

ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ – 2020 నామినేషన్ల జాబితా ఇటీవలే విడుదలైంది. ఉత్తమ డ్రామా, ఉత్తమ నటుడు, ఉత్తమ కామెడీ సిరీస్‌ కేటగిరిల్లో భారతీయ వెబ్ సిరీస్‌లు చోటు దక్కించుకున్నాయి. షెఫాలి షా నటించిన ‘ఢిల్లీ క్రైమ్’ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో నామినేషన్‌‌కు ఎంపికైంది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. కాగా ఈ వెబ్ సిరీస్.. జర్మనీకి చెందిన చరైట్-2(సీజన్ 2), యూకేకె చెందిన క్రిమినల్ యూకే, అర్జెంటీనాకు చెందిన ‘ద బ్రాంజ్ గార్డెన్’ వెబ్ సిరీస్‌లతో పోటీ పడుతోంది. దీంతో పాటు ప్రీతిష్ నంది ‘ఫెమినిస్ట్ సిరీస్ – ఫోర్ మోర్ షాట్స్’ కామెడీ సిరీస్ విభాగంలో నామినేషన్ సాధించింది. దీన్ని అనుమీనన్, నుపుర్ అస్థానా డైరెక్ట్ చేశారు. ఇదే గాక, ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్‌సిరీస్‌లో నటించిన అర్జున్ మాథుర్ ఉత్తమ నటుడిగా నామినేషన్‌లో చోటు సాధించాడు.

2020 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్లను ఎమ్మీస్ అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం ప్రకటించారు. ప్రధాన కార్యక్రమం నవంబర్ 23న జరగనుంది.

Advertisement

Next Story