- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో యాక్సిడెంట్ జరిగితే..?
భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో.. గురుత్వాకర్షణ అనుభూతికి ఆవల.. కింద మీద అనే తేడా ఉండదు. లెఫ్ట్.. రైట్ అనే దిక్కులేవీ లేనిచోట.. మనం పంపించిన ఉపగ్రహాలు బిజీబిజీగా తిరగాడుతుంటాయి. కొన్ని స్థిరంగా ఒక దేశానికే అట్టిపెట్టుకునే శాటిలైట్లూ(జియోస్టేషనరీ శాటిలైట్లు) ఉంటాయనుకోండి. మరెన్నో శకలాలు స్థిరమైన వేగంతో నిలకడగా ప్రయాణిస్తుంటాయి. దేని కక్ష్యలో అదుంటే ప్రమాదం లేదు. కానీ, ఎప్పుడైనా ఒకే కక్ష్యలోకి రెండు ఉపగ్రహాలు వచ్చినప్పుడే సమస్యంతా.
అభివృద్ధి చెందిన దేశాలు ఉత్తమ, అత్యుత్తమ సేవల కోసం ఖగోళంలోకి పంపిస్తున్న ఉపగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వీటికి తోడు.. కాలంచెల్లిన ఉపగ్రహాలు సేవలు మానేసినా ప్రయాణాన్ని విరమించవన్న సంగతి తెలిసిందే. దీంతో భూమి చుట్టూ ఆర్బిటాళ్లలో ఉపగ్రహాలు, అంతరిక్ష శకలాలు వగైరా అన్నీ కలగాపులగంలాగా భ్రమిస్తూనే ఉంటాయి. ఇవి ఒకదానికి మరొకటి ఎదురుపడితే.. యాక్సిడెంటే మరి. ఢీకొని ఏర్పడే విస్ఫోటనం నుంచి చెల్లాచెదురుగా వాటి శకలాలు అన్ని వైపులా వేగంగా విస్తరిస్తాయి. అవి కూడా అలాగే, అంతరిక్షంలో ప్రయాణిస్తుంటాయి. ఆ శకలాలతో ప్రస్తుతం సేవలందిస్తున్న ఉపగ్రహాలు, స్పేస్ స్టేషన్, అలాగే భవిష్యత్తులో ప్రయోగించే శాటిలైట్లకూ ముప్పే. నియంత్రణలేకుండా నడిచే ఈ శకలాలు ఇప్పటికే కాలం చెల్లిన ఉపగ్రహాలను ఢీకొన్నా ఇప్పుడున్న శకలాలకు తోడు మరిన్ని శకలాలు తోడవుతాయి. దీంతో భవిష్యత్ లో భూమిపై దృష్టిపెట్టే ఉపగ్రహ ప్రయోగాలకు పరిస్థితులు అంతరిక్షంలో సంక్లిష్టంగా మారుతాయి.
తాజాగా, ఇటువంటి ప్రమాదమే తృటిలో తప్పిపోయింది. చివరి నిమిషంలో కొన్ని మీటర్ల దూరం నుంచే రెండు ఉపగ్రహాలు పాస్ కావడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకుని ప్రస్తుతానికి గండం గట్టెక్కిందని సంతోషించారు. దీనిని అంతరిక్షంలో శకలాలు, ఉపగ్రహాలను ట్రాక్ చేసే లియోల్యాబ్స్ క్లోజ్‌గా అబ్జర్వ్ చేసింది. ఇన్‌ఫ్రారెడ్ అస్ట్రానమికల్ శాటిలైట్(ఐఆర్ఏఎస్), జీజీఎస్ఈ-4లు గతనెల 30న ఢీకొనే ప్రమాదముందని లియోల్యాబ్ అంచనా వేసింది. 15 నుంచి 30 మీటర్ల సమీపం నుంచి పాస్ కావొచ్చని అంచనావేసినప్పటికీ.. ఒక్క శాతం నేరుగా ఢీకొనే ప్రమాదమూ ఉందని కూడా ఆందోళన చెందింది. ఈ రెండూ కాలం చెల్లిన ఉపగ్రహాలు కావడంతో వాటిని నియంత్రించే శక్తి కూడా శాస్త్రవేత్తలకు లేకుండా పోయింది. దీంతో ఆ ప్రమాదానికి మౌన ప్రేక్షకుల్లాగా నిస్సహాయంగా ఉండటం మినహా ఏమీ చేయలేమని వారు చేతులెత్తేశారు. జీజీఎస్ఈ-4 ఉపగ్రహాం ఒకవైపు కత్తిలా పొడుచుకొచ్చినట్టు ఉన్నట్టు తెలియడంతో ఈ ప్రమాద సంభావ్యతను 1:20గా అంచనా వేసింది లియోల్యాబ్. కానీ, అదృష్టవశాత్తు ఆ ప్రమాదం తప్పిపోయింది. అతిసమీపం నుంచి ఈ రెండు ఉపగ్రహాలు ఢీ కొట్టుకోకుండా వెళ్లిపోయాయి.
ఆ రెండు ఉపగ్రహాల కదలికపై లియోల్యాబ్స్ ఎప్పటికప్పుడు అంచనాలు వెల్లడించింది. కానీ, నాసా మాత్రం ఎటువంటి వివరాలను పంచుకోలేదు. ఈ రెండు ఉపగ్రహాల ప్రయోగంలో అమెరికా పాత్ర ఉండటమే దాని మౌనానికి కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. 1983లో ఐఆర్ఏఎస్‌ను యూఎస్ ప్రయోగించింది. జీజీఎస్ఈ-4 స్టోరీ వేరు. రెండో ప్రపంచ యుద్ధానంతరకాలంలో సోవియన్ యూనియన్ నుంచి విడుదలయ్యే రాడార్ ఉద్గారాలను పసిగట్టే నిఘా కోసం అమెరికా దీనిని ప్రయోగించింది. సాధారణ శాటిలైట్లను ట్రాక్ చేయడమే కష్టతరం అటువంటిది నిఘా శాటిలైట్‌ల ట్రాకింగ్ గురించి శోధించడం మరింత కష్టం.
ఏదిఏమైనప్పటికీ అంతరిక్షంలో మనిషి పంపించిన ఉపగ్రహాలు, వాటి వ్యర్థాలు ముప్పుగా పరిణమించాయన్న విషయన్ని గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకైతే అంతర్జాతీయ అంతరిక్ష చట్టాలేమీ లేవు. భూమి నుంచి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహా శకలాల గురించి వాటిని ప్రయోగించిన సంస్థల్లో అవగాహన పెంచడం ద్వార వాటి తొలగింపుకు ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు.