టీవీఎస్ మోటార్ త్రైమాసిక నష్టాలు రూ. 139 కోట్లు

by Harish |
టీవీఎస్ మోటార్ త్రైమాసిక నష్టాలు రూ. 139 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 139.07 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 142.30 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 67.96 శాతం క్షీణించి రూ. 1,431.73 కోట్లకు చేరుకుంది. కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఈ త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాలు ఎక్కువగా ప్రభావితమైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం కంపెనీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో సడలింపులతో కొనసాగుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టీవీఎస్ మోటార్ అమ్మకాలు సానుకూలంగానే ఉన్నాయని, జూన్ చివరి నాటికి సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు, కార్యకలాపాలను తిరిగి పుంజుకునేందుకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలు ఎంతో దోహదపడ్డాయని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. ఇక, తొలి త్రైమాసికంలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 2.55 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహన అమ్మకాలను నమోదు చేసింది.

గతేడాది ఇదే త్రైమాసికంలో 8.84 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. మోటార్ సైకిల్స్ విభాగంలో 1.19 లక్షల యూనిట్లు, స్కూటర్ విభాగం 82 వేల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కాగా, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఎగుమతులు 81 వేల యూనిట్లని, గతేడాది ఇదే త్రైమాసికంలో ఎగుమతులు 2.09 లక్షల యూనిట్లని కంపెనీ పేర్కొంది. అలాగే, త్రీ-వీలర్ అమ్మకాలు గతేడాది 40 వేల యూనిట్లతో పోలిస్తే ప్రస్తుత ఏడాది 12 వేలకు తగ్గాయని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed