- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడు పేదరికం నుంచి TTDP అధ్యక్షుడిగా.. ‘బక్కని’ రాజకీయ ప్రస్థానం!
దిశప్రతినిధి, రంగారెడ్డి : కడు పేద వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టి ఆనాడు పట్టెడన్నానికి కూడా నోచని బీద పరిస్థితి ఆయనది. తిండి లేని పరిస్థితి నుంచి పట్టుదలతో శ్రమించి, ఎంతో ఉన్నత స్థాయికి చేరిన తెలంగాణ తెలుగుదేశం(టీటీటీడీ) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఓ సామాన్య వ్యక్తి రాజకీయ ప్రస్థానం ఇది. ఆయనొక అవివాహితుడు. సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అయినా ఆయనలో రాజకీయ గాంభీర్యం, దీక్షా దక్షత కలిగిన సంస్కారం అతనిది. ఎల్లవేళలా భాగవన్నామ స్మరణతో సాగుతూ అందరి తలలో నాలుకైన వ్యక్తే షాద్ నగర్‌కు చెందిన సీనియర్ టీపీడీపీ నాయకుడు ‘బక్కని నర్సింహులు’..
తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక నమ్మినబంటు. ఎన్టీఆర్ జమానా నుండి చంద్రబాబు నాయుడు వరకు ఆయన ఎప్పుడు పార్టీకి విధేయుడే. ఎందరో పార్టీలు మారినా ఎన్నో బంపర్ ఆఫర్లు ఇచ్చినా.. ఆయన మాత్రం తెలుగు దేశం పార్టీని నమ్ముకుని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వ్యక్తిగా బక్కని నర్సింహులుకు పేరుంది. ప్రజాసేవకు తెలుగుదేశం రాజకీయ జీవితానికి ఆయన జీవితమే ధారపోశారు. అవివాహితుడుగా నేటికి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. భక్తిమార్గంలో ఆధ్యాత్మిక ప్రబోధనలతో ఆయనను అందరు గుర్తిస్తారు. వివేకానంద స్వామి భక్తుడిగా బక్కని నర్సింహులు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
ఇదీ నేపథ్యం..
బక్కని నర్సింహులు సొంత గ్రామం లింగారెడ్డి గూడా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో బక్కని నర్సింహులు రాజకీయాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. స్వతహాగా ఎదిగిన బక్కని నర్సింహులు ఎన్టీఆర్ పై అభిమానంతో ఆనాడు 1983లో తెలుగుదేశం పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా చేరారు. ఆ తర్వాత బక్కని జీవవైవిధ్యాన్ని పరిశీలించిన ఎన్టీ రామారావు స్వయంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్టును అందజేశారు. 1994లో భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి శంకర్రావును ఓడించారు. ఆ తరువాత ఆయన ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలను గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నరసింహులు పార్టీ సేవకే పూర్తిగా అంకితమై పోయారు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటుగా ఉన్నందుకు నేడు రాష్ట్ర అధ్యక్ష పదవి నజరానాగా లభించిందని చెప్పవచ్చు.
అష్టకష్టాలు ఎదుర్కొని..
బక్కని నర్సింహులు స్వగ్రామం లింగారెడ్డి గూడెం. ఆయన మొదట్లో సంఘ సేవకుడిగా పరిచయమయ్యారు. వివేకానంద స్వామి సంఘం పేరిట ఆయన యువతను ఏకం చేసి ప్రజలను భక్తి, సన్మార్గంలో తీసుకెళ్లారు. భగవద్గీత పారాయణంలో బక్కని నర్సింహులు ఈ ప్రాంతాల్లో చరిత్రకెక్కారు. ఇక్కడ చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని స్వయంగా తానే చూసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆయన ఆ దేవాలయాన్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేరు. బక్కని తన జీవితంలో చిన్ననాటి నుండే ఎన్నో కష్టాలను అనుభవించారు. తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకని సమయంలో పట్టుదలతో శ్రమించి కష్టపడి చదివి ఈనాడు ఈ స్థితికి ఎదిగారు.
బక్కని స్టైలే వేరయా..
బక్కని నర్సింహులు రాజకీయ జీవితంలో నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించడం విశేషం. ప్రతీ కార్యకర్తా పేరు ఆయనకు గుర్తుంటుంది. ప్రతీ గ్రామంలో స్వతహాగా ఆయన అభిమానులు ఉంటారు. ఏ గ్రామానికి వెళ్లిన ఆయన ప్రసంగాలు చిన్న పిల్లాడి నుండి ముసలాడి వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాలను తన మాటల ద్వారా ఆకట్టుకుంటారు. బక్కని నర్సింహులు నియోజకవర్గంలో ఎందరికో ఆత్మీయ మిత్రుడు అందుకే ఈ రోజు ఆయన అధ్యక్ష పదవిని ఇస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయనకు హర్షం ప్రకటిస్తోండడం విశేషం. బక్కని ఒక సామాన్య వ్యక్తి, ఆయనకు పెద్దగా ఆస్తి పాస్తులు లేవు, ఉండడానికి ఇల్లు మాత్రం ఉంది. ఎప్పుడు ఆర్భాటాల జోలికి వెళ్లరు. జీవహింస నేరంగా పరిగణిస్తారు. ఆయన శాకాహారి. కార్యకర్తల స్నేహితుల, శ్రేయోభిలాషుల ఇళ్లకు నేరుగా వెళ్తారు. కుటుంబ సభ్యులతో మమేకమై మాట్లాడే విశిష్టత ఆయనకు ఉంది. ఆయన ప్రతి కుటుంబంలో ఓ సభ్యులుగా ఉంటారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన జీవనశైలి.
షాద్‌నగర్‌కు గుర్తింపు..
షాద్ నగర్ నియోజకవర్గానికి బక్కని నర్సింహులు ద్వారా అనేక సందర్భాల్లో గుర్తింపు లభించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు బక్కని చేసే కార్యక్రమాలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు యూల్పేన్ సన్, మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ లాంటివారిని నియోజకవర్గానికి రప్పించుటలో ఆయన కృషి ఉంది.
షాద్‌నగర్‌లో హర్షాతిరేకాలు..
బక్కని నర్సింహులుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడంతో షాద్ నగర్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సంతోషం వ్యక్తం చేశారు. నరసింహులు రాష్ట్ర స్థాయికి ఎదగడం అభినందనీయమని అభినందనల వెల్లువ మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కూడా హర్షం ప్రకటించడం గమనార్హం. షాద్ నగర్ పట్టణంలో, స్వగ్రామం లింగారెడ్డి గూడ మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.