ఎస్తర్‌ను క్షేమంగా రష్యాకు పంపిస్తాం : టీటీడీ ఛైర్మన్

by srinivas |
ఎస్తర్‌ను క్షేమంగా రష్యాకు పంపిస్తాం : టీటీడీ ఛైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా విస్తృత వ్యాప్తిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ మూలంగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్లు, విహార యాత్రలకు వెళ్లిన వాళ్ల బాధలు అంతా ఇంతా కాదు. అయితే లాక్‌డౌన్ విధించడానికి ముందు రష్యా దేశం నుంచి ఎస్తర్ అనే యువతి తిరుపతి పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె తిరుపతిలో చిక్కుకున్న విషయం తెలిసిన పలువురు చేయూతనిచ్చారు. తాజాగా ఎస్తర్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. మీడియా ద్వారా ఎస్తర్ ఇబ్బందులను తెలుసుకున్న ఆయన బుధవారం తన ప్రతినిధిని ఆమె వద్దకు పంపి మాట్లాడించారు. ఆమె తల్లిని ఉత్తరప్రదేశ్ లోని బృందావనం నుంచి తిరుపతికి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తామని ధైర్యం చెప్పారు. రష్యన్ ఎంబసీతో సంప్రదించి ఇద్దరినీ వారి దేశానికి పంపేందుకు ఏర్పాటు చేస్తామని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. తిరుపతిలో ఆమె వసతి, ఆహారం ఇతర అవసరాలు కోరితే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎస్తర్ అభ్యర్థన మేరకు గురువారం ఆమెకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed