మంత్రివర్గం ఆమోదం తర్వాతే టీఎస్-బీ పాస్

by Shyam |
మంత్రివర్గం ఆమోదం తర్వాతే టీఎస్-బీ పాస్
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని భావిస్తున్న టీఎస్ బీ పాస్ విధానం మంత్రివర్గం ఆమోదించిన తర్వాత అమలులోకి రానుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచే ఇది అమలులోకి వస్తుందని మంత్రి కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించినా పట్టణాభివృద్ధి శాఖ మాత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. మంత్రివర్గం ఆమోదం పొందకుండా ఈ నూతన విధానం అమలులోకి రాదని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా సత్వరం అనుమతులు మంజూరు చేసిన టీఎస్ ఐపాస్ తరహాలోనే ఇప్పుడు భవన నిర్మాణాలకు అనుమతులు, లే అవుట్‌లకు అప్రూవల్, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు లాంటి వాటి కోసం టీఎస్ బీ పాస్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

అగ్నిమాపక శాఖ, స్థానిక సంస్థలు, వాటర్ బోర్డు, ఐటీ విభాగం, ఆన్‌లైన్ చెల్లింపులు ఇలాంటి అనేక విభాగాల సమన్వయంతో అనుమతులు మంజూరు చేయాల్సి ఉన్నందున సమగ్రమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సి ఉంటుందని, దాని తయారీ పూర్తయిందని, ప్రస్తుతం ట్రయల్ నడుస్తోందని వివరించారు. మంత్రివర్గం ముందు ఈ నూతన విధానం ముసాయిదాను ఉంచిన తర్వాత చర్చ జరుగుతుందని, ఆమోదం పొందిన అనంతరం ఇది అమలులోకి వస్తుందని వివరించారు. అప్పటివరకూ ప్రస్తుత డీపీఎంఎస్ విధానమే కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed