ట్విట్టర్‌కు పోటీగా ‘గెట్టర్’

by Shyam |   ( Updated:2021-07-02 02:50:06.0  )
Trump-Gettr
X

దిశ, ఫీచర్స్: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’‌ పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. భారత చట్టాలను ఉల్లంఘించినందుకు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ట్విట్టర్.. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌ను ట్విట్టర్ తన సైట్‌లో వేరే దేశంగా చూపించడంతో పాటు, జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్భాగంగా చూపించిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ట్విట్టర్ ఇలానే ప్రవర్తించింది. దాంతో చాలామంది ఇండియన్స్ ట్విట్టర్‌ను వీడి ప్రత్యామ్నాయ యాప్‌లలో చేరారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ట్విట్టర్‌పై అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు పోటీగా ‘గెట్టర్’ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తాజాగా విడుదలైంది.

ట్రంప్ మాజీ సీనియర్ సలహాదారు జేసన్ మిల్లర్ ‘గెట్టర్’‌ను లాంచ్ చేశాడు. ట్విట్టర్‌తో పాటు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘గెట్టర్’ తీసుకువచ్చినట్లు ట్రంప్ టీమ్ భావిస్తోంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రమే ఈ యాప్ లాంచ్ కాగా, వెయ్యికి పైగా డౌన్‌లోడ్స్ సాధించింది. రెండు రోజుల్లో గూగుల్ ప్లే స్టోర్‌లోనూ అందుబాటులోకి రానుంది. చైన్నోవ్ ఇంక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన గెట్టర్‌లో (గెట్టర్ అంటే Getting Together) 777 క్యారెక్టర్స్ పోస్ట్ చేయొచ్చు. ఆపిల్ యాప్ స్టోర్ గెట్టర్‌ను 17 అంతకంటే ఎక్కువ వయస్సు గల వినియోగదారులకు అనుకూలంగా రేట్ చేస్తుంది. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడానికి జస్ట్ ఇమెయిల్ చిరునామా మాత్రమే అవసరం. ఈ ప్లాట్‌ఫాం చాలా సరళమైన ట్విట్టర్ నాక్‌ఆఫ్‌గా కనిపిస్తుంది. ఇది వినియోగదారులను ఇతర గెట్టర్-ఇట్స్‌తో సంభాషించడానికి వార్తా కథనాలు, ఫోటోలు, వీడియోలతో పాటు షార్ట్ బిట్ కామెంట్స్ పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. క్యాన్సల్ కల్చర్‌ను వ్యతిరేకించడం, కామన్ సెన్స్‌ని ప్రమోట్ చేయడం, స్వేచ్ఛావాదాన్ని సమర్థించడం, సోషల్ మీడియా సంస్థల గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి, ఆలోచనలను పంచుకోవడానికి సరైన వేదిక గెట్టర్ అని సంస్థ పేర్కొంది. ‘గెట్టర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల కోసం పక్షపాతం లేని సామాజిక నెట్‌వర్క్. ఇది తమ వినియోగదారులకు ఉత్తమమైన సాఫ్ట్‌వేర్ నాణ్యతను అందిస్తోంది. ఎవరైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది’ అని గెట్టర్ పేర్కొంది.

గత మార్చిలో మిల్లెర్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ మాజీ అధ్యక్షుడు ‘రెండు లేదా మూడు నెలల్లో’ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో తిరిగి వస్తారని చెప్పారు. ట్రంప్ మే నెలలో తన సొంత అధికారిక బ్లాగును ప్రారంభించారు. కాని అతను దానిని ఒక నెల తర్వాత మూసివేసాడు. జనవరిలో జరిగిన అమెరికా కాపిటల్ హిల్ అల్లర్ల నుండి ట్రంప్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్ నిషేధించిన విషయం తెలిసిందే. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సస్పెండ్ అయిన తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆన్‌లైన్‌లో ఉండేందుకు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా గెట్టర్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించడంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఇంకా తెలియదు. కానీ ఈ యాప్‌ వేదికగా ట్రంప్ ‘నేను ఇప్పుడు నా దేశభక్తులందరితో నిజం మాట్లాడగలను’ అంటూ ఓ వ్యాఖ్య చేయడం విశేషం

Advertisement

Next Story

Most Viewed