విపక్ష ఓటర్లకు టీఆర్ఎస్ వింత ఆఫర్.. ఓట్లు వేశాకే నోట్లు..!

by Aamani |
fraud-11
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష ఓటర్లకు అధికార పార్టీ వింత ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా అన్ని రకాల ఎన్నికల్లో ఓటర్లకు ముందుగా డబ్బులు ఇచ్చాకే.. తర్వాత పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేస్తుంటారు. డబ్బులు తీసుకున్న ఓటర్లతో ప్రమాణాలు చేయించుకుంటారు.. వారి కుటుంబ సభ్యులపై, దేవుడి ఫొటోలపై ప్రమాణం చేయించుకుని.. డబ్బులు ముట్టజెబుతుంటారు. అలాంటిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ సభ్యులకు అదే విధానం అమలు చేసినా.. విపక్ష పార్టీ సభ్యులు, స్వతంత్ర ఓటర్లకు మాత్రం రివర్స్ విధానం అమలు చేశారు. ముందు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశాక.. క్యాంపునకు వచ్చిన వారికి పైసలు ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 937మంది ఓటర్లు ఉండగా.. వీరిలో అధికార పార్టీ గుర్తుతో 554 మంది గెలిచారు. ఇక స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిలో చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వీరి బలం మరింత పెరిగింది. మూడింటా రెండొంతుల మెజారిటీ ఉన్నప్పటికీ.. అధికార పార్టీ అభ్యర్థి క్యాంపు పెట్టారు. ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఒక రోజు ముందు (గురువారం) నుంచి క్యాంపు పెట్టారు. అధికార పార్టీ ఓటర్లకు రూ.లక్షతో పాటు తెలంగాణ సారె పెట్టారు. అందులో పట్టుచీర, జాకెట్, ప్యాంట్, షర్ట్, దోవతి, టవల్, పసుపు, కుంకుమతో పెట్టారు. శుక్రవారం ఉదయం క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఓటు వేశాక అక్కడి నుంచి ఎవరి గ్రామాలు, ప్రాంతాలకు వారు వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.

విపక్ష, స్వతంత్ర సభ్యులకు మాత్రం వింత ఆఫర్ ఇచ్చారు. వీరంతా క్యాంపుల్లోకి రానందున.. సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. ఓటు వేశాక.. క్యాంపులకు వచ్చిన వారికి డబ్బులు ఇస్తామని ఎక్కడికక్కడ స్థానిక నాయకుల ద్వారా సమాచారం పంపించారు. దీంతో విపక్ష, స్వతంత్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి.. స్థానిక క్యాంపునకు వెళ్లటంతో అక్కడ రూ.50వేల చొప్పున ముట్టజెప్పినట్లు సమాచారం. ఎక్కడికక్కడ ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉండటంతో.. అధికార పార్టీకి చెందిన ఓటర్లు ఓటు వేయకపోయినా తమ బలం తగ్గకుండా ఉండేందుకు ఇలాంటి వ్యూహం అమలు చేశారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేసినా.. విపక్ష, స్వతంత్ర ఓటర్ల వేసే ఓట్లతో సర్దుబాటు చేయవచ్చనే ఆలోచనతో ఇలా చేశారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed