హుజురాబాద్ బై పోల్.. దళిత ఓటర్లపై టీఆర్‌ఎస్ మరో మాస్టర్ ప్లాన్

by Shyam |   ( Updated:2021-08-06 22:54:33.0  )
KCr
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో జరుగబోయే ఉప ఎన్నికల్లో దళిత ఓట్లు చీలకుండా గంపగుత్తుగా పడేలా టీఆర్ఎస్ అధిష్టానం వ్యూహరచన చేపట్టింది. ఇప్పటికే మండలానికి ఇద్దరు ఇన్ చార్జులను నియమించగా, తాజాగా దళితులను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసేందుకు మండలానికి ఒక దళిత ఎమ్మెల్యేను నియమించింది. దళితుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి, దళితబంధుపై విస్తృత ప్రచారం చేయనున్నారు. ప్రతి ఒక్క దళిత ఓటరును కలిసేలా ప్రణాళికను రూపొందించి ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ప్రచారం నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలను గమనిస్తూ కొత్త వ్యూహాలను రచిస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక కీలకమని భావించిన పార్టీ గెలుపుకోసం ప్రయత్నం ముమ్మరం చేసింది. కుల ఓట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, మంత్రులతో ప్రచారం నిర్వహిస్తుంది. రెండో విడత గొర్రెల పంపిణీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించగా, ఈనెల 16న దళిత బంధును హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ లు సైతం పలు ఆయా కమ్యూనిటీలకు చెందిన నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

నియామకమైన దళిత ఎమ్మెల్యేలు

నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా, మాదిగ కులానికి చెందిన 35,600 ఓటర్లు, మాలలు 11,100 ఓటర్లు మొత్తం 46,700 మంది ఓటర్లు ఉన్నారు. ఈ దళిత ఓట్లు గంపగుత్తుగా పడేలా టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించడంతో పాటు మండలానికో దళిత ఎమ్మెల్యేకు బాధ్యత అప్పగించింది. కమలాపూర్ మండలానికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జమ్మికుంట మండలానికి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వీణవంక మండలానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఇల్లంతకుంట మండలానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను నియమించింది. వీరంతా మండలంలోని అన్ని గ్రామాల్లో గల దళితులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను వివరించనున్నారు.

ఇప్పటికే మండలానికి ఇద్దరు ఇన్‌చార్జీలు

హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే ఇద్దరు చొప్పున ఇన్‌చార్జులను నియమించింది. వీణవంక మండలానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుకు బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది. జమ్మికుంట మండలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ లు చూసుకుంటున్నారు. ఇల్లంతకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒంటేరు ప్రతాపరెడ్డి నియమితులయ్యారు. హుజూరాబాద్ పట్టణానికి కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు, హుజూరాబాద్ మండలానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు, కరీంనగర్ సూడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు కేటాయించబడ్డారు. కమలాపూర్ మండలానికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు పేరాల రవీందర్ రావు ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలో జరుగుతున్న మార్పులు, ఓటర్ల నాడి, వారి అభిప్రాయాలను ప్రతి రోజూ అధిష్టానానికి అందజేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి హరీష్ రావు సిద్దిపేట కేంద్రంగా హూజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలపై ప్రచారం…

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రవేశపెట్టిన రైతు బంధు, బీమా, చేనేత చేయూత, కేసీఆర్ కిట్టు, అమ్మఒడి, కల్యాణ లక్ష్మి, గొర్రెలపంపిణీ, గీతకార్మికులకు వృత్తిపన్ను రద్దు, నాయీబ్రాహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టే దళిత బంధుపై హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలను వివరించడంతో పథకాలను పెట్టిన సీఎం కేసీఆర్ కు ఓటు వేసి అండగా నిలువాలని అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఓటు కీలకంగా భావించి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed