దుబ్బాక తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ అవకాశం

by Anukaran |   ( Updated:2021-02-26 14:19:33.0  )
దుబ్బాక తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల తాయిలాలు మొదలయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న మండలి ఎన్నికల్లో యువత కుటుంబాలను ఆకర్షించడం, నాగార్జున సాగర్​ ఉపఎన్నికతో పాటు కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఆశ పెడుతోంది. దాదాపు రెండేళ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తోంది. ఆసరా దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశించింది. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కల్పించిన అవకాశాన్ని ఇప్పుడు మళ్లీ కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేస్తోంది. దీంతో పెన్షన్లపై గంపెడాశలు పెట్టుకున్న వారు ఇప్పుడు దరఖాస్తులను చేత బట్టుకుని తిరుగుతున్నారు. ప్రధానంగా సాగర్ ఉపఎన్నిక, మినీ పుర పోరు కోసమే ఈ అవకాశం అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే 10 లక్షల పెండింగ్​

రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల ఆసరా పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళలకు ఇవ్వాల్సిన పెన్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వీటితో పాటుగా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో దాదాపు 8.30 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు ఎక్కడున్నాయో కొన్ని కార్యాలయాల్లో అడ్రస్ కూడా లేదు. అయితే కొన్నిచోట్ల మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. దీంతో దాదాపు 10 లక్షల దరఖాస్తులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.

ఆ ప్రాంతాలకే పరిమితమా..

అయితే రాష్ట్రంలో ఎక్కడో ఉప ఎన్నికలో, స్థానిక ఎన్నికలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ప్రకటించడం, వాటిని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేట జిల్లాకే కొన్ని కొత్త పెన్షన్లను మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చినా పెండింగ్​పెట్టారు. ఇప్పుడు సాగర్‌తో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంతాలకే కొత్తవి మంజూరు చేస్తారని కూడా విమర్శలున్నాయి.

57 ఏళ్ల వాటి సంగతేంది?

టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 57 ఏళ్లకే పెన్షన్‌పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. గతేడాది నుంచే ప్రభుత్వం పలుమార్లు త్వరలో ఇస్తామంటూ ప్రకటిస్తోంది. 2020 మార్చిలోనే 57 ఏండ్ల వారికి పెన్షన్ అంటూ ప్రకటించినా.. అతీగతీ లేదు. ఈసారి దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. కానీ ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త పెన్షన్లకు దరఖాస్తులు తీసుకుంటున్నా.. ఈ 57 ఏళ్ల వయస్సు వారి నుంచి అర్జీలు తీసుకోవడం లేదు.

Advertisement

Next Story