రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్.. క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్

by Shyam |
రాష్ట్ర స్థాయిలో టీఆర్‌ఎస్.. క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగ సంఘాలపై రాష్ట్రస్థాయిలో అధికార పార్టీ దృష్టి పెడితే… క్షేత్రస్థాయిలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్​, కొంతమంది స్వతంత్రులు దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి నాయకత్వంతో సమావేశం, వారితో చర్చలను మంత్రులు దగ్గరుండీ సాగిస్తున్నారు. దీంతో రోజుకో సంఘం టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతుండటంతో.. ప్రధానంగా బీజేపీ కిందిస్థాయి నుంచి సమీకరించుకునేందుకు ప్లాన్​ వేస్తోంది. దీనిలో భాగంగా మండలాల వారీగా ఒక్కో సంఘాన్ని, ఉద్యోగులను పిలుపించుకుని మాట్లాడుతున్నారు. తాజాగా వరంగల్​ జిల్లాలో మండలాల వారీగా కొన్ని ఉద్యోగ సంఘాలతో బీజేపీ నేతలు సమావేశమై వారి మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరికి వారిదే

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారాయి. రెండు నియోజకవర్గాల్లో మొత్తం 1.60 లక్షల ఓట్లు ఉద్యోగులవే ఉన్నాయి. ఉద్యోగ సంఘాలకు అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగుల ఓట్లు కూడా మరిన్ని ఉన్నాయి. ఇవన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. మంత్రులను మొత్తం ఉద్యోగ సంఘాల దగ్గరకు పంపిస్తున్నాయి. రోజుకో సంఘంతో చర్చలు సాగిస్తున్నారు. ఎందుకంటే పీఆర్సీ ఫిట్​మెంట్​ విషయంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నాయి. అయితే ఉద్యోగ జేఏసీ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా… ఫిట్​మెంట్​ విషయంలో తప్పు పట్టాయి. సీఎం కేసీఆర్​తో చర్చించుకుని మెరుగైన ఫిట్​మెంట్​ సాధించుకుంటామని ప్రకటించుకున్నాయి. కానీ సీఎం కేసీఆర్​ అపాయింట్​మెంట్​ దొరకలేదు. ఫలితంగా పీఆర్సీ ప్రకటన వాయిదాలు పడుతూనే వస్తోంది. దీనిపై కొంత ఒత్తిడి వస్తున్నా ఉద్యోగ జేఏసీ సముదాయించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం మండలి ఎన్నికల్లో ఇదే అంశంపై కొన్ని ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకతను వెల్లడించాయి. ప్రధానంగా ఉపాధ్యాయవర్గాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ సముదాయించేందుకు మంత్రులు రాయబారం చేస్తున్నారు. మంత్రులు కేటీఆర్​, హరీష్​రావు, శ్రీనివాస్​గౌడ్​, గంగుల కమలాకర్​, మహమూద్​ అలీ వంటి మంత్రులంతా ఉద్యోగులతో చర్చిస్తున్నారు. పీఆర్సీపై హామీ ఇస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకత్వం టీఆర్​ఎస్​కు మద్దతు ఉంటామని ప్రకటిస్తున్నారు. అటు ఉపాధ్యాయ సంఘాలతో మాత్రం మంత్రి కేటీఆర్​ స్వయంగా మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడుతుండటంతో… కొన్ని సంఘాలు మద్దతుకు హామీ ఇస్తున్నాయి.

కిందిస్థాయిలోనే ప్రధానం

ఉద్యోగులే ప్రధానంగా పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో బీజేపీ, కాంగ్రెస్​తో పాటు రెండు నియోజకవర్గాల్లోని కీలకమైన స్వతంత్రులు మాత్రం కిందిస్థాయి ఉద్యోగులపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా మండలాలు, డివిజన్లు, జిల్లాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. పలు సమస్యలపై తీర్చేందుకు ముందుంటామంటూ హామీ ఇస్తున్నారు. దీనికి కొన్ని సంఘాల నేతలు మద్దతు తెలుపుతున్నారు. మరికొన్ని సంఘాల నేతలు మాత్రం అధిష్టానంతో చర్చిస్తామంటూ దాట వేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునేందుకు ఈ పార్టీలు, స్వతంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా స్టేట్​ కమిటీతో కిందిస్థాయి కమిటీలను వేరు చేసి ఓట్లు పొందేందుకు ప్లాన్​ వేస్తున్నారు. ఇది ఏ మేరకు సఫలీకృతమవుతుందో చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed