ఒకే దెబ్బకు మూడు పిట్టలు.. ‘హుజురాబాద్‌’లో TRS వ్యూహం అదేనా..

by Sridhar Babu |
Trs and Bjp flags
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయా..? అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ఓ సవాల్‌గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచనలో మునిగిపోగా, టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలన్న సంకల్పంతో బీజేపీ ప్రతి వ్యూహం వేయడంలో మునిగిపోయింది.

వీఐపీల చూపు అటే..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ బై పోల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు రోజుల క్రితం ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో హుజురాబాద్‌లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అభ్యర్థిని ప్రకటించకున్నప్పటికీ టీఆర్ఎస్ గెలవాలన్నదే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రముఖుల పర్యటనలు విపరీతంగా పెరిగిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా హుజురాబాద్‌లోనే తిరుగుతున్నారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల నుంచి మొదలు ప్రతీ ఒక్క విభాగానికి ఇంచార్జీలను నియమించారు. వీరంతా కూడా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈటల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు.

వన్ షాట్ త్రీ బర్డ్స్..

ఈటలను ఓడించడం వల్ల మూడు రకాల ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అట్రాక్షన్.. ఏమీ లేదని చేతల్లో నిరూపించే అవకాశం దొరుకుతుందని, అలాగే ఈటల ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యంలోకి నెట్టేసినట్టు అవుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ లోకసభ పరిధిలోనే హుజురాబాద్ సెగ్మెంట్ ఉండటం కారణంగా.. ఈటల ఓటమితో ఆయన ప్రభావం కూడా గణనీయంగా తగ్గుతుందన్న ఆలోచనతో టీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

బీజేపీ ప్రతి వ్యూహం..

టీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు వేసే యోచనలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైంది. ఈటల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన ప్రకాష్ జీని కూడా రంగంలోకి దింపింది. అలాగే గ్రౌండ్ లెవల్లో కూడా పకడ్బంధీ వ్యూహంతో ముందుకు సాగేందుకు బీజేపీ కేడర్‌తో పాటు ఈటల అనుచరులను కూడా పురమాయించాలని భావిస్తోంది. నియోజకవర్గంలో రాజేందర్‌కు ఉన్న అనుకూలతను ఓట్లుగా మల్చుకునే విధంగా కార్యాచరణ రూపొందించారు. బండి సంజయ్ సహా ముఖ్య నాయకులంతా కూడా హుజురాబాద్‌ను కేంద్రంగా చేసుకుని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. నెగిటివ్ ఓటింగ్‌కు ఆస్కారం లేకుండా గ్రామాల్లో క్యాంపెయిన్ నిర్వహించాలని భావిస్తున్నారు.

కాస్ట్‌లీ ఎలక్షన్స్.. ?

రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికలే అత్యంత కాస్ట్‌లీ ఎన్నికలుగా మారనున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుంటుండటంతో.. బై పోల్ సమయంలో డబ్బుల వర్షం కురుస్తుందేమో అన్నట్టుగా తయారయ్యాయి అక్కడి పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే బీజేపీ.. రాష్ట్రంలో బలం పుంజుకునేందుకు అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశాలు, బీజేపీ ఓడిపోతే టీఆర్ఎస్.. అడ్వంటైజ్‌గా మల్చుకునే అవకాశాలు ఉన్నందున ప్రలోభాలు, హామీలు, రాజకీయ ఎత్తుగడలకు ప్రధాన కేంద్రంగా హుజురాబాద్ మారనుంది.

Advertisement

Next Story