రమేష్ రాథోడ్‌‌తో సోపతి.. బీజేపీ ఎంపీకి బిగ్ షాక్!

by Aamani |   ( Updated:2021-07-13 07:44:47.0  )
BJP-MP-Soyam-Bapurao,-Ex-MP
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ఎంపీ సోయం బాపూరావుకు సొంత సామాజికవర్గం నుంచే ఊహించని షాక్ తగులుతోంది. ఉద్యమం పేరుతో ‘తుడుందెబ్బ’ను వాడుకొని తమ ఓట్లతో గెలుపొంది.. నేడు తమ జాతినే విస్మరిస్తున్నాడని ఆదివాసీ తెగలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ సంఘ భవనంలో దాదాపు తొమ్మిది గిరిజన తెగలకు చెందిన నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు చర్చించి, తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు. తమ ఓట్లతో గెలిచిన సోయం బాపురావు తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

Tribal-Leaders

‘తుడుందెబ్బ’ను తాకట్టు..

ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగిస్తామని చెప్పి ఆదివాసులను ఎంపీ మోసం చేస్తున్నారని ఆ తెగల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘లంబాడా హటవ్.. ఆదివాసీ బచావ్’’ నినాదంతో తుడుందెబ్బ నాయకత్వంలో మొదట కాంగ్రెస్‌తో జత కట్టిన సోయం బాపురావు ఆ తర్వాత ఎంపీ టిక్కెట్ కోసం బీజేపీలో చేరారని ఆరోపించారు. తన రాజకీయ లబ్ధి కోసం ‘తుడుందెబ్బ’ను వాడుకొని ఆదివాసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిసారీ ఏదో రాజకీయ పార్టీకి ‘తుడుందెబ్బ’ను తాకట్టు పెడుతూ తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. లంబాడాలను తొలగించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ అమాయక ఆదివాసులైన తమను ఇంకా మోసగిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడాలను తొలగించడమే లక్ష్యంగా పోరాడిన సోయం ఇప్పుడు లంబాడా నాయకుడైన రాథోడ్ రమేష్‌తో జతకట్టి ‘లంబాడా టైగర్ రాథోడ్ రమేష్’ అంటూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

రాథోడ్‌తో సోపతి ఇందుకేనా..?

లంబాడా హటావో ఉద్యమాన్ని సోయం ముందుండి నడిపించారని గుర్తుచేశారు. ఆయన మాటలు నమ్మి పార్లమెంటు నియోజకవర్గంలోని గిరిజన తెగలు అందరూ ఓట్లు వేసి గెలిపించామని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల్లో ఒక్కసారి కూడా గిరిజన సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఎంపీగా సోయం బాపూరావును గెలిపించి మోసపోయామని ఆవేదన చెందారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి లంబాడాలతో దోస్తీ చేస్తున్న సోయం వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసి నాయకులు జగ్గు పటేల్, సోనేరావు, తుడుందెబ్బ నాయకుడు తానాజీ, లక్ష్మణ్, వసంత్ పలువురు ఉన్నారు.

Advertisement

Next Story