లంచావతారులు..ఏసీబీ.. అంటే భయమేదీ..?

by Aamani |
లంచావతారులు..ఏసీబీ.. అంటే భయమేదీ..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : అవినీతి నిరోధక శాఖ అంటేనే గతంలో హడలిపోయేవారు. ఏసీబీ దాడులు అంటూ ఎప్పుడో ఒకసారి వినిపించేది. కానీ లంచం తీసుకోవడం.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం సాధారణంగా మారిపోయింది. ఏసీబీ అంటే అసలు భయమే లేకుండా పోతున్నది. లంచం తీసుకుంటూ పట్టుబడితే కొంతకాలానికి ఉద్యోగం రాకుండా పోతుందా..? మళ్ళీ ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్న అతి నమ్మకం ఉద్యోగులు అధికారులను లంచావతారులుగా మారుస్తున్నది. నిర్మల్ జిల్లాలోని సరిగ్గా ఏడాది తిరుగక ముందే ఏడుగురు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కడం పెరుగుతున్న లంచాల ఉధృతికి అద్దం పడుతున్నది.

విసిగివేసారిన వారే ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. సత్వరమే పనులు చేయించుకునేవారు దొడ్డి దారిన లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అలాంటి కేసులు అసలు బయటకు రావడం లేదు. ప్రధానంగా రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి భారీగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిస్థితులను బట్టి చూస్తే అధికారులు ఉద్యోగులకు ఏ స్థాయిలో లంచాలకు మరిగారో అర్థం అవుతుంది.

అసలు భయం ఉంటేగా..!

ప్రభుత్వ శాఖలో అధికారులు ఉద్యోగులు లంచం తీసుకోవడం తమ ఉద్యోగ ధర్మంలో ఒక భాగంగా మార్చుకున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. లంచం తీసుకునే వారిలో భయం అనేది కనిపించడం లేదు. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ ఇంకా లంచాలు తీసుకునే సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. ఫిర్యాదులు చేస్తే గానీ ఏసీబీ యంత్రాంగం రంగంలోకి దిగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు నిఘా పించడం అంతరంగిక వేగులను పెట్టుకుని అవినీతిని నియంత్రించే పద్ధతులను కఠినం చేస్తే గానీ లంచాల కథకు ముగింపు ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వరుస ఘటనలతో కలకలం..

నిర్మల్ జిల్లాలో సరిగ్గా ఏడాది వ్యవధిలో ఏడు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నగదు తీసుకుంటూ పట్టుబడిన కేసులే ఉన్నాయి. కొన్నిఅధికారుల ప్రాపర్టీ కేసులు వేరుగా నమోదయ్యాయి. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన స్టేషన్ బెయిల్ కోసం మామడ ఎస్సై రాజు 10 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నవంబర్ 4వ తేదీన నిర్మల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ చేసే విషయంలో జూనియర్ అసిస్టెంట్ అరుణ్, తాత్కాలిక ఉద్యోగి రాజు 8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అది ఏడాది డిసెంబర్ 18న కడెం మండలం కు చెందిన ఒక కార్మికుడు జిల్లా కార్మిక అధికారి సాయిబాబాకు 25 వేలు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన కడెం మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన ఒకరు గిఫ్ట్ డీడ్ విషయంలో తహసీల్దార్ రాజేశ్వరి డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యలు రూ.9 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

అదే నెల 25వ తేదీన నిర్మల్ పురపాలక సంఘంలో ఒక ఇంటి అసెస్మెంట్ విషయంలో 3500 లంచం తీసుకుంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి గంగాధర్ బిల్ కలెక్టర్ నవంత్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా ఈ నెల 13న సొంత శాఖలో పనిచేస్తున్న సహచర ఉద్యోగి సర్వీసు పుస్తకంలో కొన్ని ఎంట్రీలు చేసే విషయంలో లంచం తీసుకుంటూ నిర్మల్ పురపాలక శాఖ ఉద్యోగి షాకీర్ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన జరిగి పక్షం రోజులు గడవక ముందే తాజాగా జిల్లా కేంద్రంలోని సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జగదీష్ సేత్వార్ జారీ చేసేందుకు 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం కలకలం రేపింది. వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఒంట్లో భయం లేకుండా పోతుండడం చర్చకు దారి తీస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed