- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్యంలో ‘ఆర్ఆర్ఆర్’ మంటలు..!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిజాం నిరంకుశ పాలనపై రజాకార్లతో పోరాడిన గోండు వీరుడు కొమురం భీమ్ చరిత్ర వక్రీకరణకు గురవుతోందా..? అన్న ఆందోళన ఆదివాసుల్లో నెలకొంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో భీమ్‌ను ముస్లిం వేషధారణలో చూపడమే ఈ ఆందోళనకు కారణమని తెలుస్తోంది. దీనిపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని ఆదివాసీ ఏరియాల్లో నిరసనల జ్వాల మొదలైంది. సినిమాను అడ్డుకుని తీరుతామని ఆదివాసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ట్రైలర్‌తో పాటు.. ఆ సినిమాను నిషేధించాలని, లేదంటే రాజమౌళి అంతు చూస్తానంటూ ఆదిలాబాద్ పార్లమెంట్‌సభ్యుడు, ఆదివాసీ సంఘాల నేత, తుడుందెబ్బ వ్యవస్థాపక కన్వీనర్ సోయం బాపురావు అల్టిమేటం జారీ చేశారు. తాజా పరిణామాలు కొత్త ఆందోళనలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆందోళనకు కారణం చరిత్రపై దాడేనా..?
ఆదివాసుల ఆరాధ్యదైవమైన భీమ్చరిత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఎరుగని వారుండరు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు.. నక్సల్బరీ ఉద్యమం ఆయన స్ఫూర్తితో సాగినవే. అన్నింటికీ మించి స్వతంత్ర సంగ్రామం తరువాత నిజాం పాలనలో ఉన్న తెలంగాణ విముక్తి కోసం ఆయన చేసిన పోరాట పటిమ మర్చిపోలేనిది. మన్యంలో ఆదివాసీలను ఏకం చేసి రజాకార్ల పై సైద్ధాంతిక పోరాటం చేశారు. దీంతో ఆయన చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అయితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న సినిమాలో కొమురం భీమ్ పాత్రధారణలో జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో కన్పించడం వివాదానికి కారణమవుతోంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా, రజాకార్లపై పోరాటం చేసిన భీమ్‌ను వారి వారసుడిగా చూపారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రైలర్ పై తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సినిమాను నిలువరించాలని డిమాండ్ చేశాయి.
ఎంపీ సోయం తీవ్ర ఆగ్రహం..!
ఆదివాసీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి చెందిన పార్లమెంట్‌సభ్యుడు సోయం బాబూరావు సినిమా ట్రైలర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఆయన ఓ వైపు ఆదివాసులతో, మరోవైపు హిందుత్వ సమాజంతో రాజకీయ నేతగా స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఆయనకు రాజకీయంగా బాగా కలిసి వచ్చాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భీమ్‌ను ముస్లిం యువకుడిగా చూపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సినిమా వ్యతిరేక ఆందోళనకు బీజేపీ నుంచి కూడా బలమైన మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ తో సినిమాను నిలిపివేయాలని డిమాండ్ క్రమంగా బలపడుతోంది.
నిరసనల వెల్లువ
ఆర్ఆర్ఆర్ సినిమాను నిషేధించాలని, కొమురం భీమ్పాత్రను వక్రీకరించారంటూ ఆదివాసీ సంఘాలు చేస్తున్న ఆందోళన క్రమంగా ఊపందుకుంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలో భీమ్విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఆసిఫాబాద్ ప్రాంతంలో రాజమౌళి దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ లో తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల నేతలు సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపు కార్యాచరణ చేస్తున్నారు. ఆదివాసులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో జేఏసీలు ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి.
రాజమౌళి ఏం చేస్తారో..?
ఆదివాసీ సంఘాలతో పాటు బీజేపీ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. పాలనా పరంగా అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి వినతులు వెళ్లాయి. మరోవైపు పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో రాజమౌళి వివాదాస్పద భీమ్వేషధారణ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొమురం భీమ్జీవిత చరిత్రను మసకబారేలా చేయడం… ఆయన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివాసుల విజ్ఞప్తిని మన్నించి రాజమౌళి ఈ వివాదాస్పద పాత్రను సినిమా నుంచి తొలగించాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి పెరుగుతోంది.