ఘోర విషాదం విద్యుదాఘాతంతో తండ్రి, కూతురు మృతి

by Shyam |
current shock
X

దిశ, పటాన్‌చెరు: గుడికి పోయి వచ్చిన ఆ దంపతుల సంతోషం విద్యుత్ వైర్ రూపంలో ఆ ఇంట పెను విషాదం నింపింది. తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… ఒరిస్సా రాష్ట్రం బుద్దాపడ గ్రామానికి చెందిన బసుదేవ్ మాలిక్ (36), భార్య రీనా మాలిక్‌లు గత 10 సంవత్సరాల క్రితం మండలంలోని ఇస్నాపూర్ కు వచ్చారు. మాలిక్ పాశమైలారం పారిశ్రామికవాడలో గల కిర్బీ పరిశ్రమలో పర్మినెంటు వర్కర్‌గా చేస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం పెద్ద కూతురు స్కూల్‌కు వెళ్లగా, చిన్న కూతురు కూన్ మాలిక్(2)తో కలిసి భార్య భర్తలు ఇస్నాపూర్ లో గల గుడికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో వాళ్ళు ఉండే రెండవ అంతస్తు లోని బయట సజ్జపైన ఉన్న ఐరన్ రాడ్డు తీస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్తు తీగలకు రాడ్డు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురికావడంతో బసుదేవ్ మాలిక్ రేలింగ్ గోడపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని పక్కనే ఉన్న చిన్న కూతురు కూడా మృతి చెంది కొంత భాగం మాడిపోయింది. వీళ్ళ పక్కనే ఉన్న భార్య రీనా మాలిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పటాన్‌చెరు క్రైమ్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రామానాయుడులు సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన తండ్రి, కూతుర్లను పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన రీనా మాలిక్‌ను చందానగర్ లోని పిఆర్ కె ఆస్పత్రికి తరలించారు. పెద్ద కూతురు స్కూల్‌కు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. మృతుడి తమ్ముడు బుల్ మాలిక్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామునాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, చిన్న కూతురు చనిపోవడం, తల్లి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో పెద్ద కూతురు అనాధగా మిగిలిపోవడంతో ఆ కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story