ఖ‌మ్మంలో కోల్డ్‌ దందా !

by Sridhar Babu |   ( Updated:2020-03-28 09:08:24.0  )
ఖ‌మ్మంలో కోల్డ్‌ దందా !
X
స్టోరేజీల్లో మిర్చి రైతుల‌కు నో స్పేస్‌

దిశ‌, ఖ‌మ్మం: ఆ స్టోరేజీలు ఖాళీగానే ఉంటాయి.. కానీ ఖాళీ లేవంటారు. బుక్ చేసుకున్న‌వారంతా రైతులే.. వాస్తవానికి కాదు. ఈ మాట‌లు కాస్త విచిత్రంగా ఉన్నా.. ఖ‌మ్మం జిల్లాలో జ‌రుగుతున్న కోల్డ్ స్టోరేజీ దందాకు మాత్రం అతికిన‌ట్లు స‌రిపోతాయి. ఏదైతేనేం వ్యాపారులు, క‌మీష‌న్‌దారులు, నిర్వాహకులు క‌లిసి ఆడుతున్న అక్ర‌మాల ఆట‌లో మిర్చి రైతులు చిత్త‌వుతున్నారు. ధ‌ర త‌గ్గిన‌ప్పుడు నిల్వ చేసుకుని, పెరిగిన‌ప్పుడు అమ్ముకునేందుకు వీలుగా ప్ర‌భుత్వం స‌రుకును స్టోరేజీల్లో నిల్వ‌చేసుకునే అవ‌కాశం రైతులకు క‌ల్పించింది. అయితే ఈ సౌలభ్యం రైతుల‌ క‌న్నా, వ్యాపారుల‌కే బాగా ఉపయోగ‌పడుతూ.. చివ‌రికి రైతుల‌నే దోపిడీ చేసేందుకు ఓ మార్గంగా మారుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ముందుగానే బినామీ రైతుల, చిన్న వ్యాపారుల పేర్ల మీదుగా డ‌బ్బులు చెల్లించి స్టోరేజీని బుక్ చేసుకుంటున్న బ‌డా వ్యాపారులు.. రైతులు స‌రుకును గిడ్డంగుల్లోకి త‌ర‌లించ‌కుండా దారులు మూసేస్తున్నారు. దీంతో మార్కెట్‌కు త‌ర‌లించిన స‌రుకును ఇంటికి తీసుకెళ్లల్లేక‌, తీసుకెళ్లినా ఎక్కువ కాలం ఉంచుకోలేక చివ‌రికి వ్యాపారులకు నామ‌మాత్ర‌పు ధ‌ర‌కే విక్ర‌యించాల్సిన ప‌రిస్థితిని రైతులకు క‌ల్పిస్తున్నారు. ఇలా త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసిన పంట‌ను కోల్డ్ స్టోరేజీల్లో భారీగా నిల్వ చేస్తున్న కొంత‌మంది బ‌డా వ్యాపారులు.. ధ‌ర పెరిగాక ఎగుమ‌తి చేసి భారీ లాభాలు గడిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌గ‌ల‌న‌క‌.. రాత్ర‌న‌కా క‌ష్ట‌ప‌డి పండించిన రైతుకు మాత్రం నామ‌మాత్ర‌పు లాభం ద‌క్కుతోంది. కొన్ని సంద‌ర్భాల్లో న‌ష్టాలే వెక్కిరిస్తుంటాయి.

ఈసారి కూడా అంతే..

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న క‌రోనా ప్రభావం వ్య‌వ‌సాయ‌రంగంపైనా ప‌డింది.ఈ సీజ‌న్‌లో అత్య‌ధికంగా ఖ‌మ్మం మార్కెట్‌లో మిర్చి పంట క్వింటాలుకు రూ.21600 వ‌ర‌కు ప‌లికింది. ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా క్ర‌మంగా ప‌డిపోతూ వ‌చ్చింది. జ‌న‌తా క‌ర్ఫ్యూకు ముందు క్వింటాల్ మిర్చి రూ.14500గా ఉంది. ఈ క్రమంలో ధ‌ర పెరిగాక అమ్ముకుందాం అనుకున్న రైతులకు బడా వ్యాపారులు కోల్డ్‌ స్టోరేజీలు దొరక్కుండా చేస్తూ.. వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. జిల్లాలో 13 గిడ్డంగులు ఉన్నాయి. వాటిల్లో ఖాళీలున్నా సరే.. నిర్వాహకుల నుంచి నిండి ఉన్నాయనే సమాధానం వినిపిస్తుండటంతో రైతులు ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. అంతేకాకుండా కొంత‌మంది ముందస్తుగా బుక్ చేసుకున్నారంటూ రిజిస్ట‌ర్ల‌లో బినామీ పేర్ల‌ను చూపుతుండటం గమనార్హం. వాస్త‌వానికి వ్యాపారులే బినామీ పేర్ల‌పై బుకింగ్‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. కానీ ఎక్క‌డా సాంకేతికంగా దొర‌క్కుండా క‌మీష‌న్‌దారులు, ఖ‌రీదుదారులు రైతుల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. ఈ అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల్సిన అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేయ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా మంత్రి అజ‌య్‌కుమార్ ప‌ట్టించుకోవాల‌ని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అధికారులు, వ్యాపారులు, చివ‌రికి కొంత‌మంది ప్ర‌జాప్ర‌తినిధులు కుమ్మ‌క్కవ‌డంతోనే ఈ దందా య‌థేచ్ఛ‌గా సాగుతోంద‌ని రైతులు మండిప‌డుతున్నారు.

రోడ్ల‌పైకి వంద‌లాది రైతులు..

శుక్ర‌, శ‌నివారాల్లో రైతులు వంద‌లాది వాహ‌నాల్లో మిర్చి పంట‌ను కోల్డ్ స్టోరేజీకి తీసుకురాగా.. ఖాళీ లేవనే బోర్డులే దర్శనమిచ్చాయి. ఖ‌మ్మం మార్కెట్‌కు స‌మీపంలో ఉన్న సాయి ప్రియ కోల్డ్ స్టోరేజ్‌లో ఖాళీ ఉన్నా.. నిల్వ చేయ‌డానికి అంగీక‌రించ‌డం లేద‌ని రైతులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో క‌లెక్ట‌ర్ క‌ర్ణ‌న్ ఆదేశాల‌తో సాయి ప్రియ కోల్డ్ స్టోరేజ్‌లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో కోల్డ్ స్టోరేజీలోని ఏ, బీ చాంబ‌ర్ల‌లో మూడో ఫ్లోరులో ఖాళీ ఉన్నట్లు గుర్తించారు. కాగితాలపైన ఉన్న లెక్కలకు, కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఖాళీల‌కు, స‌రుకుకు పొంత‌న లేదని గుర్తించిన‌ట్లు స‌మాచారం. అయితే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోబోతున్నారనే విష‌యాలేవీ వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Next Story

Most Viewed