కలెక్టరా? టీఆర్ఎస్ కార్యకర్త‌ా? : ఉత్తమ్ ఫైర్

by Anukaran |   ( Updated:2020-07-01 07:47:08.0  )
కలెక్టరా? టీఆర్ఎస్ కార్యకర్త‌ా? : ఉత్తమ్ ఫైర్
X

దిశ, మెదక్: రాష్ట్రంలో జరుగుతున్న పనులు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయో చెప్పడానికి కొండపోచమ్మ ప్రాజెక్టులకు పడుతున్న గండ్లు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడిన ప్రదేశాన్ని టీపీసీసీ బృందం పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, నర్సారెడ్డిలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజలను, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఇలా కొట్టుకుపోతే భవిష్యత్ ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని, ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన ఈఎన్‌సీని, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, నష్టాన్ని మొత్తం కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన గ్రామాలకు, నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలన్నారు. చిన్న ప్రవాహానికే కాలువలకు గండ్లు పడితే ఇక ప్రాజెక్టుల నాణ్యత ఎలా ఉందోనన్న సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం నియోజకవర్గమే ఇలా ఉంటే ఇక రాష్ట్రం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు, జిల్లా కలెక్టర్ కనీసం సందర్శించక పోవటం ఏంటని ఉత్తమ్ మండిపడ్డారు.

కేసీఆర్ మీ ఫామ్ హౌస్‌కు నీరు తెచ్చే ప్రాజెక్టు కాలువలే ఇంత నాసిరకం ఉంటే వేరే చోట ఎట్లుండాలని ప్రశ్నించారు. కాలువకు గండి పడటం సహజమేనని ఈఎన్‌సీ హరీరాం మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ఎవడబ్బ సొమ్ము అని ఇదంతా మాములే అని హరీరాం అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున‌సాగర్ కాలువలు మట్టి కాలువలు అవి ఇప్పటికీ బ్రేచింగ్ కాకుండా ఉన్నాయి, కానీ సిమెంట్ కాలువలు ఇలా గండి పడటం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందని హరీరాంను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నాసిరకం పనుల్లో మీకు వాటా ఉందని అనుకుంటామని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, కలెక్టర్‌గా కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కనీసం ఫామ్ హౌస్ నుంచి రాడు, కనీసం కలెక్టర్‌గా నువ్ కూడా రాలేదని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడుగా నేను ఫోన్ చేస్తే కూడా కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలెక్టర్ కూడా పార్టనర్‌గా ఉన్నాడని ఇక్కడి ప్రజలు అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇది ప్రతిబింబం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed