మళ్ళీ వాళ్లకే అవకాశం.. ఏకగ్రీవం కానున్న అధికార పార్టీ అభ్యర్థులు

by Shyam |
మళ్ళీ వాళ్లకే అవకాశం.. ఏకగ్రీవం కానున్న అధికార పార్టీ అభ్యర్థులు
X

దిశ, ప్రతినిధి రంగారెడ్డి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. అందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓటు వేయనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేసేందుకు సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు బరిలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ

ఉమ్మడి జిల్లాలో ఖాళీకానున్న రెండు స్థానాలకు డిసెంబర్‌ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరిరాజు(శంభీపూర్‌రాజు) పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ముగియనుంది. దీంతో ఈ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో రెండు స్థానాలు కైవసం చేసుకోవడం టీఆర్‌ఎస్‌కు నల్లేరుపై నడకేనని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మళ్లీ మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజుకే ఛాన్స్‌ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే శంభీపూర్‌ రాజుకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. అనూహ్య పరిణామాలు జరిగితే మినహా వీరిద్దరి పేర్లలో మార్పు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నారు.

డిసెంబర్‌ 10న ఎన్నికలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు నవంబర్‌ 23వ తేది తుది గడువు కాగా, నవంబర్‌ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్‌ 10వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. డిసెంబర్‌ 14న కౌంటింగ్‌ జరగనుంది.

ఉమ్మడి జిల్లాలో 1179 మందికి ఓటుహక్కు : కలెక్టర్ అమోయ్ కుమార్

స్థానిక సంస్థలకు సంబంధించి రంగారెడ్డి శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అమోయ్ కుమార్ అన్నారు. ఈనెల 16 నుండి 23 వరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తామని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1179 ఓటర్లు ఉన్నారు. అందులో స్త్రీలు 627, పురుషులు 552 ఉన్నారు. పోలింగ్ కోసం రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవేళ్లలో 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed