మన దేశంలో మళ్లీ విదేశీయులకే ఆ కీలక పదవి!

by Shyam |   ( Updated:2021-10-09 11:41:14.0  )
Australia-Player1
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా హోడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగిసిపోనున్నది. తనకు హెడ్ కోచ్‌గా కొనసాగాలనే ఆసక్తి లేదని ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐకి స్పష్టం చేశాడు. దీంతో జాతీయ జట్టుకు కొత్త కోచ్‌ను వెతికే పనిలో పడింది. ఇండియా – ఏ, అండర్-19 జట్లకు గతంలో కోచ్‌గా పని చేసిన రాహుల్ ద్రవిడ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ఏసీ) డైరెక్టర్‌గానే కొనసాగడానికి ద్రవిడ్ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, బీసీసీఐ దేనినీ ధృవీకరించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2021, టీ20 వరల్డ్ కప్ నిర్వహణతో బీసీసీఐ బిజీగా ఉన్నది. దీంతో కోచ్ పదవికి సంబంధించిన కసరత్తు టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రారంభం కానున్నది. అయితే ఈసారి విదేశీ కోచ్‌ను నియమించేందుకు బోర్డు పెద్దలు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. టీమ్ ఇండియాకు చివరి సారిగా గారీ కిర్‌స్టెన్ విదేశీ కోచ్‌గా ఉన్నాడు. అతడి హయాంలోనే భారత జట్టు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి మరో విదేశీ కోచ్‌ను బీసీసీఐ నియమించలేదు.

టామ్ మూడీ ఆసక్తి…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కోచింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న టామ్ మూడీకి టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియాకు చెందిన ఫాక్స్ స్పోర్ట్స్ అనే వెబ్‌సైట్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. గతంలో రెండు పర్యాయాలు టీమ్ ఇండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసిన టామ్ మూడీ ఈసారి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. వాస్తవానికి టామ్ మూడీకి కోచింగ్ కెరీర్లో మంచి రికార్డే ఉన్నది. ఆస్ట్రేలియా, శ్రీలంక జాతీయ జట్లకు ఆయన కోచ్‌గా పనిచేశారు. మూడీ కోచ్‌గా ఉన్న సమయంలోనే శ్రీలంక జట్టు 2007లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు రెండోసారి చేరింది. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కోచ్‌గా పని చేశాడు. అతడు కోచ్‌గా ఉన్నప్పుడే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నది. అయితే రెండేళ్ల క్రితం ఎస్ఆర్‌హెచ్ జట్టును వదిలేశాడు. కానీ, ఈ ఏడాది నుంచి సన్‌రైజర్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా శ్రీలంక క్రికెట్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నాడు. 2017, 2019లో టీమ్ ఇండియా కోచ్ పదవికి టామ్ మూడీ పేరు షార్ట్ లిస్ట్ అయ్యింది. అయితే రవిశాస్త్రి పేరును కోచ్ పదవికి ఎంపిక చేయడంతో టామ్ మూడీకి నిరాశే మిగిలింది. అయితే ఈసారి మాత్రం మూడీ పేరు ముందు వరసలో ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అనిల్ కుంబ్లేపై వ్యతిరేకత..
టీమ్ ఇండియాకు గతంలో కోచ్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లేను తిరిగి ఆ పదవిలో కూర్చోబెట్టాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. అయితే బోర్డులోని మిగతా పెద్దలకు కుంబ్లే కోచ్ పదవిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా మిగతా ఆటగాళ్లతో కుంబ్లేకు విభేదాలు వచ్చాయి. కుంబ్లే కోచ్‌గా ఉంటే మేము ఆడలేము అని బీసీసీఐకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అందుకే టీమ్ ఇండియాలో మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా కుంబ్లేను పక్కన పెట్టాలని కొందరు బీసీసీఐ పెద్దలు సూచిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్‌లో కుంబ్లే కోచ్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్ కూడా పేలవ ప్రదర్శన చేయడం ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఇక మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేరు కూడా కోచ్ పదవికి పరిశీలనలో ఉన్నది. ఎంతో కాలంగా సన్‌రైజర్స్‌కు మెంటార్‌గా ఉండటమే కాకుండా టెస్ట్ ఫార్మాట్‌లో విదేశీ గడ్డపై లక్ష్మణ్‌కు మంచి అనుభవం ఉన్నది. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ పేరునుకూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed