- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పూడిక తీతకు రంగం సిద్ధం !

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా సిల్ట్ కారణంగా అన్నదాతకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. 30 శాతం మేర నీటి వాటాను ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక రైతాంగానికి అందకుండా చేస్తున్నది. దీని కారణంగా రైతాంగానికి తీవ్రనష్టం జరుగుతున్నది. దీర్ఘకాలంగా ప్రాజెక్టుల్లో నుంచి పూడికతీత తొలగింపు వ్యవహారం చర్చల్లో మాత్రమే ఉంది. కార్యాచరణ దాల్చే విషయంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. కానీ తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతకు అండగా ఉండేందుకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడం, ప్రాజెక్టుల్లో పేర్కొన్న సిల్ట్ తొలగించడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టింది.
ప్రాజెక్టులకు ఇక మహర్దశ...
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పేరుకున్న మట్టిని తొలగించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలకు దిగడంతో రైతాంగానికి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సాగునీరు అందించే బహుళార్ధ ప్రాజెక్టు శ్రీరాంసాగర్. ఈ ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులు కాగా, 90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అయితే ప్రాజెక్టులో భారీ మొత్తంలో నిండిన సిల్ట్ కారణంగా గరిష్టంగా 60 నుంచి 65 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేయగలుగుతున్నది. దీంతో రైతులకు తీవ్రనష్టం కలుగుతున్నది. అయితే వచ్చే రెండు నెలల్లో ప్రాజెక్టుల్లో మట్టి తొలగింపు చర్యలకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. రెండు నెలల్లో టెండర్లు కూడా పిలుస్తామని స్పష్టం చేశారు. దీంతో దశాబ్దాలుగా ప్రాజెక్టుకు శనిలా మారిన సిల్ట్ తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.
అయితే ఇప్పటికే కడెం ప్రాజెక్టు పూడికతీతకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు కూడా నిర్వహించింది. రాజస్థాన్ కు చెందిన ఈతర్ కంపెనీ ఈ పనులు చేపట్టనుంది. త్వరలోనే మట్టి తొలగింపు చర్యలు చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు తరహాలోనే కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ ప్రాజెక్టుకు కూడా టెండర్లు పిలుస్తారని చెబుతున్నారు. ఇసుక ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా ఈ మట్టి నుంచి తీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి స్థలసేకరణ కూడా చేపట్టారు. తాజాగా సాగునీటి ప్రాజెక్టులను రైతాంగానికి వరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి.