టిక్‌టాక్‌కు గడువు ఇచ్చే ప్రసక్తే లేదు

by Harish |   ( Updated:2020-09-11 07:12:03.0  )
టిక్‌టాక్‌కు గడువు ఇచ్చే ప్రసక్తే లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా వీడియో యాప్ టిక్‌టాక్ (TIK TOK) అమెరికా కార్యకలాపాలను విక్రయించడానికి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ (ByteDance)కు సెప్టెంబర్ 15 వరకు ఇచ్చిన గడువే చివరిదని మళ్లీ పొడిగింపు ఉండదని తేల్చేశారు. గడువు ముగిసిన సమయానికి అమెరికా కంపెనీలకు విక్రయించాలి లేదంటే కార్యకలాపాలను మూసేయాలని ట్రంప్ చెప్పారు.

కొవిడ్-19 (KOVID-19) నేపథ్యంలో దేశ భద్రతా కారణాలతో ఇటీవల చైనా యాప్‌లను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో టిక్‌టాక్ సైతం ఉంది. ఈ క్రమంలోనే ఇదివరకు టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను విక్రయించడానికి ట్రంప్ మూడు నెలల గడువును ఇచ్చారు. బైట్‌డ్యాన్స్ (ByteDance) కూడా కొనుగోలుదారుల కోసం ప్రయత్నిస్తోంది. కానీ, ట్రంప్ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో బైట్‌డ్యాన్స్ పరిస్థితి ఆందోళనగా ఉంది. సాంకేతిక, ఆర్థిక సమస్యల గురించి సవివరమైన సమాచారంతో ఏదైనా ప్రతిపాదన ఆమోదం కోసం సమర్పించాలని చైనా అధికారులు బైట్‌డ్యాన్స్‌కు చెప్పారు. సమీక్షకు కొంత సమయం పడుతుందని ఓ నివేదికలో అధికారులు తెలిపారు.

మైక్రోసాఫ్ట్ (Microsoft), ఒరాకిల్ (Oracle) సంస్థలు చైనా నిబంధనలను అనుసరించి కార్యకలాపాల కొనుగోలుకు ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే, టిక్‌టాక్ ఉపయోగించే కొన్ని సాంకేతిక అంశాల ఎగుమతి విషయంలో మరింత స్పష్టత అవసరమని ఇరు సంస్థలు కోరాయి. టిక్‌టాక్ ఉపయోగించే యూజర్ల సమాచారం చైనాకు చేరుతోందని, వారి సమాచారానికి సంబంధించి భద్రతపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కాగా, టిక్‌టాక్ మాత్రం వినియోగదారుల సమాచారం భద్రంగా ఉన్నట్టు చెబుతోంది.

Advertisement

Next Story