అక్రమార్జనే ధ్యేయం.. మాజీ సైనికుడినీ వదలని వీఆర్వోలు

by Sumithra |
అక్రమార్జనే ధ్యేయం.. మాజీ సైనికుడినీ వదలని వీఆర్వోలు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు వీఆర్వోలు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనికి సంబంధించి డిస్టిక్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణ రమణకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మాజీ సైనికుడు బాలరాజుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ప్రభుత్వం ఐదు ఎకరాలు కేటాయించింది. ఆ భూమి పట్టా కోసం మాజీ సైనికుడు నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల తహసీల్దార్ రాధాకృష్ణ వద్దకు వెళ్లాడు. అయితే, అక్కడి రెవెన్యూ అధికారులు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో తోచక ఈ విషయాన్ని బాధిత వ్యక్తి ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

ఏసీబీ ప్లాన్ ప్రకారం.. మాజీ సైనికుడు బాలరాజు రెవెన్యూ అధికారి డిమాండ్ చేసిన రూ. ఐదు లక్షలకు బదులుగా రెండు లక్షలు ఇస్తానని అంగీకరించాడు. ఆ డబ్బులను తెలకపల్లి మండలం లక్కారం రెవెన్యూ కార్యదర్శి శీర్ల బాల నారాయణకు అందజేయగా.. అతను వాటిని కొండారెడ్డిపల్లి వీఆర్ఓ బాల్ నారాయణ, రామాజిపల్లి వీఆర్ఓ చిన్నయ్య, కొండనాగుల వీఆర్వో బుచ్చి రాములుకు అందజేశాడు. ఏసీబీ అధికారులు బాల నారాయణను అదుపులోకి తీసుకోగా అసలు విషయం వెల్లడించాడు. దీంతో వెంటనే ఏసీబీ అధికారులు ముగ్గురు వీఆర్వోలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెప్పారు.

వీఆర్వోల సొంత ఇళ్లలో సోదాలు..

తెలకపల్లి మండలం లక్కారం గ్రామంలోని వీఆర్వో బాల నారాయణ, అచ్చంపేట మండలం చందాపూర్ గ్రామంలోని చిన్నయ్య, బుచ్చి రాములు స్వగృహంలో ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. 17ఏళ్లు దేశ రక్షణలో విధులు నిర్వహించిన మాజీ సైనికుడి వద్ద రూ. 5లక్షలు డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారుల ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా ఈ తతంగమంతా ప్రచారం కావడంతో అచ్చంపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed