పాఠశాల రుణం తీర్చుకుంటున్న ఆ ఇద్దరు పూర్వ విద్యార్థులు

by Shyam |
Amrabad
X

దిశ, అచ్చంపేట : ఇద్దరు పూర్వ విద్యార్థులు తాము చదివిన పాఠశాల రుణం తీర్చుకుంటున్నారు. అక్షర జ్ఞానం నేర్పిన స్కూల్‌కు చేయూతనిస్తున్నారు. విద్యార్థులకు వంట పనులు చేస్తూ ఓ విద్యార్థిని.. ఆర్థికసాయం చేస్తూ మరో విద్యార్థి బడికి బాసటగా నిలుస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలో ఈ అపూర్వ విద్యార్థులు అందిస్తోన్న సేవలు నేటి యువతకు స్ఫూర్తిని నింపుతున్నాయి.

అమ్రాబాద్ మండలం, మన్ననూర్ గ్రామంలోని అంబేద్కర్ కాలనీ పాఠశాలలో విద్యార్థులకు వంట చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వంట మనిషికి ప్రభుత్వం వెయ్యి రూపాయలే చెల్లిస్తుండటంతో కూలి గిట్టడం లేదని ఎవరు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన పాతుకుల మల్లమ్మ తానే వండిపెట్టడానికి సిద్ధపడింది. తాను చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుతున్నందుకు కృతజ్ఞతగా విద్యార్థులకు వంట చేసిపెడతానని ముందుకు వచ్చింది.

అయితే ఆమె స్ఫూర్తికి మెచ్చిన అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి, సీనియర్ జర్నలిస్టు దూమోర్ల భాస్కర్ తనవంతుగా సాయం అందించారు. మల్లమ్మకు ఆరు నెలల పాటు వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తానని ప్రకటించాడు. ఇందులో భాగంగా ఈ నెల వేతనం కింద మంగళవారం ఉపాధ్యాయులు, కాలనీవాసుల సమక్షంలో మల్లమ్మకు రూ.1000 అందజేశారు. మంగళవారం వంట మనిషి మల్లమ్మకు ఉపాధ్యాయులు కాలనీవాసుల సమక్షంలో అందజేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే విషయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుకు వచ్చిన వారిద్దరిని కాలనీవాసులు అభినందించారు.

Advertisement

Next Story