- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ తీగ పువ్వులో.. ఈ కొమ్మన నవ్వేను!
దిశ, వెబ్‌డెస్క్:
వేశ్య వృత్తిలో ఉన్నవాళ్లను సమాజంలో చాలా హీనంగా చూస్తారు. ఇక వారికి పుట్టిన పిల్లల బాల్యమైతే నరకంలాగ సాగుతుంది. మమ్మల్ని కనండి అని ఆ పిల్లలు అడగలేదు, పిల్లల్ని కనాలి అని వేశ్య వృత్తిలో ఉన్నవారికి కూడా ఉండదు. కానీ చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్లు భూమ్మీద పడతారు. వాళ్ల జీవితం కూడా తప్పిదాల మధ్యనే నడుస్తుంది. పుట్టిన దగ్గరి నుంచి అమ్మ దగ్గర పడుకునే అవకాశం ఉండదు. ఇక ఆడపిల్లల సంగతి చెప్పక్కర్లేదు. పెరుగుతున్నపుడు అమ్మ పడుతున్న నరకాన్ని చూసిన వారు పెద్దయ్యాక అమ్మలాగే అవ్వాల్సి వస్తుందనే భయంతో క్షణక్షణం చచ్చిపోతుంటారు. మగపిల్లలేమో పెరిగి పెద్దయ్యాక తల్లిని, సోదరిని మార్కెటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని లోలోపల భయపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు నాగ్‌పూర్‌కి చెందిన రాంభావ్ ఇంగొలే దేవుడి లాంటి వాడని అనడంలో అతిశయోక్తి లేదు.
గత 30 ఏళ్లుగా సామాజికవాది రాంభావ్ ఇంగొలే, సెక్స్ వర్కర్ల పిల్లలను చేరదీసి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. 1980 దశకంలో నాగ్‌పూర్ ఆర్థికపరంగా పుంజుకుంటోంది. గంగా యమునా ప్రాంతంలో ఉన్న వేశ్య వృత్తి కేంద్రాల మీద అప్పుడు వ్యతిరేకత ప్రారంభమైంది. వేశ్య వృత్తిని పారద్రోలే ఉద్యమంలో ఇంగొలే కూడా భాగమయ్యారు. ఆ సమయంలోనే సెక్స్ వర్కర్ల పిల్లల దీనస్థితి చూసి ఇంగొలే మనసు చలించింది. అక్కడి సంప్రదాయం ప్రకారం వేశ్యకు పుట్టిన ఆడబిడ్డ వేశ్య కావాలి, మగబిడ్డ వేశ్యల మార్కెటింగ్ వ్యక్తిగా మారాలి. ఇలా జరగడం సెక్స్ వర్కర్లకు కూడా ఇష్టం లేదని ఇంగొలే గ్రహించాడు. వారి పిల్లలకు చదువు చెప్పించడం గురించి వారిలో అవగాహన కలిగించాడు. ఇందుకోసం ఆమ్రపాలి ఉత్కర్ష్ సంఘ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఆయన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
ఈ పని మొదలు పెట్టాక ఇంగొలేను ఆయన తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేశారు. సమాజం వెలివేసిన వాడిలాగ చూడటం మొదలుపెట్టింది. ఆయన ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ కూడా దెబ్బతిన్నది. ఎందుకు పనికి రాని పని చేస్తున్నాడంటూ అందరూ హేళనలతో కించపరిచేవారు. వీటికి తోడు సెక్స్ వర్కర్ల పిల్లలకు చదువులు చెప్పడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఎలా అనే ప్రశ్న ఆయనను చాలా ఇబ్బంది పెట్టేది. కానీ ఇంగొలే పట్టువిడవలేదు. ఎనిమిదేళ్లు ఇబ్బందులు పడి 1992లో తన స్వచ్ఛంద సంస్థను రిజిష్టర్ చేయించగలిగాడు.
అదృష్టమేంటంటే సెక్స్ వర్కర్లే ఆయనకు పని సాయంగా నిలబడ్డారు. వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పిల్లలను ఇంగొలేతో పంపించి పోలీసులతో సమస్య రాకుండా చేసేవారు. కానీ తనతో పాటు పిల్లలను ఇంట్లో ఉంచుకుంటే ఇరుగుపొరుగు వారితో సమస్యలు ఎదురయ్యేవి. వారి బాధ తట్టుకోలేక ఇంగొలే ఏడు సార్లు ఇల్లు మారాడు. చివరికి 2007లో పిల్లల కోసం మవిన్ దేశాయ్ అనే దాత భూసాయం చేయడంతో అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాడు. అంతేకాకుండా ఇంగొలే చేస్తున్న పని గురించి మీడియా ద్వారా తెలుసుకుని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి సాయం చేసేవారు. ప్రస్తుతం ఈ స్కూల్‌లో 239 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంగొలే సాయం పొంది ఇప్పుడు మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇటీవలే ఆయన సేవలను వలస వచ్చిన కుటుంబాల పిల్లలకు, అనాథలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.