హుజురాబాద్‌లో TRS ఓటమిని ఒప్పుకుందా..? ఇదిగో సాక్ష్యం..!

by Sridhar Babu |   ( Updated:2021-08-24 09:31:27.0  )
trs defeat
X

దిశప్రతినిధి, కరీంనగర్ : సభలు, సమావేశాలు, కులాల వారీగా సమీకరణాలతో పాటు అధికార టీఆర్ఎస్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డైరక్ట్‌గా ఓటర్లను కలవాలన్న లక్ష్యంతో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ టీఆర్ఎస్‌కు ఓటేయాలని అభ్యర్థించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటికే పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి పిలిచే సంప్రదాయాన్ని ఆరంభించింది.

ఐదు వార్డులకో ఇంచార్జి..

మంగళవారం హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని 30 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఐదు వార్డులకు ఓ ఇంచార్జిని నియమించి ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించే ప్రోగ్రాంను ప్రారంభించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వార్డుల వారీగా పని విభజన కూడా చేశారు. నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ఈటల రాజేందర్ వ్యవహారం గురించి కూడా ఓటర్లకు డైరక్ట్‌గా వివరించనున్నారు.

ప్రజల్లోకి వెళ్లడమే లక్ష్యం..

ఈటల రాజేందర్ వ్యవహారం తరువాత హుజురాబాద్‌లో పట్టు సాధించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మొదలు క్షేత్రస్థాయి నాయకుల వరకూ ప్రతిఒక్కరూ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ హుజురాబాద్‌లో సానుకూలత మాత్రం కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో మారుతున్న పరిణామాల గురించి అప్‌డేట్ అవుతున్న అధిష్టానం అందుకు తగ్గట్టుగా కొత్త కొత్త కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటింటికీ బొట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది.

దళిత బంధు ఎంత మేర సక్సెస్..

ఇదిలాఉండగా, హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళితబంధుతో పాటు ఆ నియోజకవర్గంలోని ముఖ్యనేతలకు కీలక పదవులు కట్టబెట్టినా అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కంటే ఈటలకే ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకనగా దళితుబంధు నిధులు పేరుకే విడుదలైనా లబ్దిదారులు అందరికీ చేరలేదు. తొలుత వంద మందికి మాత్రమే ఇస్తానని చెప్పడంతో మిగతా వారు నిరాశకు లోనయ్యారు. ఈ పథకంతో పాటు బీసీ బంధు కూడా ఇవ్వాలని అక్కడక్కడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా తెప్పించుకుంటున్న సీఎం.. ఏదీ వర్కౌట్ కాకనే తాజాగా ‘‘ఇంటింటికీ బొట్టు.. ఓటేస్తానని ఒట్టు పెట్టు’’ వంటి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని జిల్లా నాయకత్వానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు కేసీఆర్ కట్ ఔట్‌, ఉద్యమ సెంటిమెంట్‌తో రాలిన ఓట్లు ప్రస్తుతం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా రాలడం కష్టమని టీఆర్ఎస్ అధిష్టానానికి అర్థమైనట్లు సమాచారం. ఎలాగైనా ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నట్టు అక్కడి ప్రజలు, నిరుద్యోగులు చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ఇంకెన్ని కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed