ఇంటర్ ఫెయిల్ అయ్యానని నాయనమ్మను ఒంటరి చేసిన విద్యార్థిని

by Sumithra |   ( Updated:2025-04-23 08:00:17.0  )
ఇంటర్ ఫెయిల్ అయ్యానని నాయనమ్మను ఒంటరి చేసిన విద్యార్థిని
X

దిశ, భిక్కనూరు : ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన రెడ్డి పూజ (17) కామారెడ్డి పట్టణంలోని ఆర్యభట్ట కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. నానమ్మ బంధువుల ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉండలేక సమీపంలో ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లి రాత్రి పడుకుంది. తెల్లవారాక నిద్రలేచి, ఇంటి ముందు కల్లాపి చల్లి వస్తానని పెద్దమ్మకు చెప్పి, తన ఇంటికి చేరుకుంది.

అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్ వెలువడిందని ఫెయిల్ అయ్యానని నిద్రకు ఉపక్రమించే సమయంలో పెద్దమ్మకు చెబుతూ ఏడ్చింది పూజ. అవన్నీ మనసులో పెట్టుకోకు మళ్లీ పరీక్ష రాసి పాస్ కావచ్చు బిడ్డా అంటూ ఆ తల్లి ధైర్యం నూరి పోసింది. తన ఇంటికి చేరుకోగానే ఏమైందో ఏమో తెలియదు కాని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇల్లు వాకిలి ఊడ్చి వస్తానని వెళ్లిన బిడ్డ ఇంకా ఇంటికి తిరిగి రాకపోయేసరికి పెద్దమ్మ పూజ ఇంటికి వచ్చి చూడగా, ఆత్మహత్య చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ కు గురై బోరున విలపించింది. విద్యార్థిని మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండడం, అక్కడక్కడ శరీరం పై తోలు ఊడి రావడం కనిపించింది. మంటల వ్యాప్తికి ఇంట్లోని కరెంట్ వైర్లు పూర్తిగా కాలిపోవడమే కాకుండా పక్కనే ఉన్న పుస్తకాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మృతురాలికి నానమ్మ తప్ప తల్లిదండ్రులు లేరు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.


Advertisement
Next Story

Most Viewed