మంత్రి కీలక వ్యాఖ్యలు.. జులై, ఆగస్టులలో కరోనా థర్డ్ వేవ్

by vinod kumar |   ( Updated:2021-04-29 23:22:05.0  )
Corona virus
X

ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో థర్డ్ వేవ్ కూడా రావొచ్చని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. అంటువ్యాధి నిపుణుల అంచనాల ప్రకారం.. మహారాష్ట్రలో జులై, ఆగస్టు నెలల్లో కరోనా వైరస్ థర్డ్ వేవ్ విజృంభించే ముప్పు ఉన్నదని గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ వివరించారు. అంతలోపు వైద్య సామగ్రి, ఆక్సిజన్, ఇతర యంత్రాలను సరిపడా సేకరిస్తుందని లేదా స్వయంగా అభివృద్ధి చేసుకునే శక్తిని సమకూర్చుకుంటుందని అన్నారు. మే చివరిలోపు సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరవచ్చునని, థర్డ్ వేవ్ ప్రభుత్వానికి మరో పెనుసవాల్‌ను విసిరే ప్రమాదముందని చెప్పారు. కాబట్టి, అప్పటిలోపు అత్యవసర యంత్రాలన్నీ సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించామని, అప్పుడు కొరతల గురించి మాట్లాడకుండా ఇప్పుడే అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపామని అన్నారు. ప్రస్తుతం అవసరమున్న ఆక్సిజన్‌ను స్థానికంగానే తయారుచేసుకుంటున్నామని, మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని తెలిపారు.

కొవిడ్‌ సంబంధ ఫెసిలిటీ సెంటర్లు, ఇతర నిర్మాణాలకు కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు ముందుకురావాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కోరినట్టు హెల్త్ మినిస్టర్ తోపె అన్నారు. వీటికి వెచ్చించే ఖర్చును సీఎస్ఆర్‌గా పరిగణించుకోవచ్చునని సీఎం తెలియజేసినట్టు వివరించారు. తద్వారా రాష్ట్రంపై భారం తగ్గుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed