వారు జనం మెచ్చిన నేతలు

by Shyam |
వారు జనం మెచ్చిన నేతలు
X

దిశ, వరంగల్: వారు జనం మెచ్చిన నేతలు. జనం సంక్షేమం కోసం నిత్యం పరితపిస్తుంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమను నమ్ముకున్న వాళ్ల కోసం శ్రమిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ (కొవిడ్ -19) ప్రపంచాన్ని వణికిస్తోన్న నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైన జనం బాగోగులు చూస్తున్నారు. వాళ్లు ఆ మహమ్మారి బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ చైతన్యం చేస్తూ ఇతర నేతలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క.

పిలిస్తే పలికే దయన్న..

గత నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ముద్రవేసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో నిలబడతారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆయన ప్రజలే మధ్యనే ఉంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని తన స్వగ్రామం పర్వతగిరిలో ఉంటూ ఉమ్మడి జిల్లాలో కరోనా నివారణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్వపు
వరంగల్ జిల్లా అంతటా పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉండగా ప్రజలెవరూ ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. ఇతర ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, వైద్యులను సమన్వయం చేస్తూ కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు తదితర సరుకుల ఏర్పాట్లు చేశారు. జిల్లా అంతటా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. తానే స్వయంగా కొన్ని ప్రాంతాల్లో ద్రావణాన్ని పిచికారీ చేసి సిబ్బందిని ఉత్సహ పరిచారు. వరి, మొక్కజొన్న రైతుల కోసం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయించి రైతు పక్షపాతి అని చాటుకున్నారు. కరోనా నివారణకు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. కరోనా బాధితుల సహాయార్థం దాతలను ప్రోత్సహిస్తూ విరివిగా విరాళాలు సేకరిస్తున్నారు.

ఆదివాసీల అండగా సీతక్క

నాడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తుపాకి చేతపట్టి నక్సల్బరీ ఉద్యమంలో పనిచేసిన సీతక్క రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వారిని మరవలేదు. ఏజెన్సీలో నివాసం ఉంటున్న ఆదివాసీలు, గిరిజన, కోయ తెగల అభివ్రద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటూనే ఏజెన్సీ వాసుల అవసరాలను తీరుస్తున్నారు. అడవులు, గూడాల్లో నివాసం ఉంటున్న వారి అవసరాలను తెలుసుకుని కొండలు, కోనలు దాటి వెళ్లి సదుపాయాలు సమకూరుస్తున్నారు. 15 రోజులుగా ట్రాక్టర్లలో బియ్యం, ఉప్పు, పప్పులు, కూరగాయలు తీసుకెళ్లి వారికి అందజేస్తున్నారు. అంతేగాకుండా చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి ములుగు జిల్లాకు వచ్చిన వలస కార్మికుల కోసం నిత్యవసర వస్తువులు సమకూరుస్తోంది.

Tags: people leaders, minister errabelli, mla seethakka, helping people

Advertisement

Next Story

Most Viewed