అప్పు చేయాలి.. ఖర్చు పెట్టాలి : చిదంబరం

by vinod kumar |
అప్పు చేయాలి.. ఖర్చు పెట్టాలి : చిదంబరం
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించారు. ఘనంగా ప్రకటించిన ఈ ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం.. వలస కార్మికులకు రిక్త హస్తమిచ్చిందని అన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన కొన్ని చర్యలు మినహా కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ నిరాశపరిచిందని తెలిపారు. మంగళవారం ప్రధాని ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ వివరాలను బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొంటున్న లక్షలాది మంది వలస కార్మికుల ఇక్కట్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చిదంబరం విమర్శించారు. పని చేయనిదే పూట గడవని పేదలను విస్మరించడం దారుణమని అభిప్రాయపడ్డారు. అలాగే, పేద ప్రజల (కనీసం 13 కోట్ల కుటుంబాలు)కు నేరుగా డబ్బు పంపిణీ చేసే ప్రకటనే లేదని తెలిపారు. పేదలకు నేరుగా నగదు అందించి ఆదుకోవాలని ఫ్రెంచి ఆర్థికవేత్త థామస్ పికెట్టీ సూచించిన తర్వాతి రోజే ఈ ప్రకటనలు వెలువడ్డాయి కానీ, కేంద్రం మాత్రం బీదలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన సాయంలోనూ పెద్ద సంస్థలే అధికంగా లబ్ధి చేకూరేలా చర్యలున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం.. దాని భయాలు, మూర్ఖత్వానికి స్వీయ బందీగా మారిందని అన్నారు. ఇటువంటి ఆపత్కాలంలో కేంద్ర ప్రభుత్వం అప్పు చేయాలి.. ఖర్చు పెట్టాలని చెప్పారు. అలాగే, రాష్ట్రాలకూ ఆ వెసులుబాటు కల్పించాలి కానీ, కేంద్రం అటువైపుగా ఆసక్తి చూపలేదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story