- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర పుస్తకాల కెక్కని పోరు.. పాలకులకు పట్టదా..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిమ్మరాజులు పాలించిన నిర్మల్ పట్టణం.. గుట్టలు, చెరువులు, బురుజులు, కొయ్యబొమ్మలే కాదు.. సాహసోపేతమైన వీరుల చరిత్రకు.. వారి అసమాన త్యాగాలకు సజీవసాక్ష్యం. నాటి స్వాతంత్ర్య సంగ్రామానికి పునాదులు వేసి.. ఎందరో వీరులకు స్ఫూర్తి నింపి పోరాటంలో భాగమైన పోరుగడ్డ.. రొహిల్లా దండు తోడుగా గోండు వీరుల అండతో రాంజీగోండు సాగించిన పోరాటం అసామాన్యం. చివరకు శత్రువు చేతికి చిక్కినా.. వెరువకుండా మాత్రుభూమి కోసం చిరునవ్వులతో ఒకేసారి వెయ్యిమంది వీరులు ఉరికొయ్యలు ముద్దాడిన ఘనత నిర్మల్ గడ్డది. ఇలాంటి కీలక ఘటన చరిత్ర పుటల్లోకి ఎక్కకున్నా.. అలాంటి వీరుల జీవితం అజరామరం. చిరస్మరణీయం. వీరి స్ఫూర్తితోనే ఎందరో సమరయోధులు నిజాం కాలంలో స్వాతంత్య్రం కోసం పోరాడి.. జైలు జీవితం గడిపారు.. వారి పోరాటాల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం..
చరిత్రకు ఎక్కని వీరుల గాధ..
దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలోనే ఎక్కడా.. ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లోని జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యిమందికి పైగా కాల్చి చంపిన ఘటనకు యాభయేళ్ల ముందే నిర్మల్ గడ్డపై ఓ కీలక సంగ్రామ ఘట్టం చోటు చేసుకుంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వెయ్యిమంది వీరులు.. ఒకేసారి తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేశారు. జన్మభూమి కోసం ఆ గిరిబిడ్డలు వీరోచిత పోరాటంతో ఆంగ్లేయ, నైజాం సైన్యాలను ముప్పతిప్పలు పెట్టి నిర్మల్ గొలుసుకట్టు చెరువుల నీళ్లు తాగించారు. శత్రువులు కుయుక్తులతో చుట్టుముట్టి.. తమ మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నా.. పూలమాలల్లా భావించారు. తమ మోములపై చెదరని చిరునవ్వులతో చావును ఆహ్వానిస్తూ.. శత్రువు గుండెల్లో దడ పుట్టించారు.
నేలపైకి ఊడలు దిగిన మర్రిచెట్టుకు వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీసిన ఆ ఘటన నిర్మల్‌లో జరిగింది. నాడు స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన ఆ వీరుల గాధ ఇప్పటికీ చరిత్ర పుస్తకాల్లోకి చేరలేదు. పరాయి పాలన పారదోలేందుకు ప్రాణాలర్పించిన ఆ వీరులను నేటి పాలకులు గుర్తించడం లేదు. జిల్లా అధికారులకూ అమరులగాధపై కనీస అవగాహన లేకపోవడం దురదష్టకరం. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా నిర్మల్ పట్టణానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం..
చరిత్రకెక్కని ధీరుడు.. రాంజీగోండు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు గోండు రాజుల ఖిల్లా. పచ్చని అడవులు పర్చుకున్న ఈ ప్రాంతానికి 1857లో జరిగిన ప్రథమ స్వతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్న ఘనత ఉంది. ఉత్తర భారతదేశంలో మొదలైన ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా ఇక్కడి వీరులు పోరుసల్పారు. ఈ క్రమంలో 1860లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ తొలి స్వాతంత్య్ర పోరాటాన్ని మన ప్రాంతంలో కొనసాగించాలని పిలుపునిచ్చాడు. చెల్లాచెదురుగా ఉన్న తన వాళ్లందరినీ ఏకం చేశాడు. దేశమంతా విస్తరిస్తున్న ఆంగ్లేయులను, స్థానికంగా దోచుకుంటున్న హైదరాబాద్ నవాబులను ఏకకాలంలో ఎదుర్కొవాలని సమరశంఖం పూరించాడు.
ఇందుకు గోదావరి తీరంలో.. చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకుని నెలల తరబడి పోరు సాగించారు. అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం, ఆంగ్లేయ బలగాలు గోండులపై దాడులకు పాల్పడగా.. వాళ్లనూ గిరిబిడ్డలు వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఎంతటి బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలున్నా.. రాంజీగోండు శత్రువులను ముప్పతిప్పలు పెట్టారు. కొండలు, గుట్టలు, అడవులను ఆసరాగా చేసుకుంటూ గెరిల్లా తరహా పోరు చేశారు. చివరకు దొంగదెబ్బతో శత్రువులు వీరిని పట్టుకున్నారు. నిర్మల్ నుంచి ఎల్లపెల్లికి వెళ్లే మార్గంలో గల మహా మర్రిచెట్టుకు రాంజీగోండుతో పాటు వెయ్యిమంది వీరులను ఉరితీశారు.
స్మారకాలే సాక్షాలుగా మిగిలినే..
ఇంతటి ఘన చరిత్ర ఉన్న రాంజీగోండు, మిగతా వీరుల చరిత్ర బయటకు రాలేదు. పాఠ్య పుస్తకాలకు ఎక్కలేదు. నేటితరం స్థానికుల్లోనే చాలామంది ఇది తెలియకపోవడం శోచనీయం. వెయ్యిమంది వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యమైన మహా మర్రిచెట్టుకు వెయ్యిఉరుల మర్రిగా పేరొచ్చింది. ఎల్లపెల్లి వెళ్లే దారిలో ఉండగా.. కొన్నేళ్ల క్రితం ఆ మర్రిచెట్టు గాలివానకు నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చాక.. పలు సంఘాల నాయకులు 2007 నవంబర్ 14న వెయ్యిఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు.
2008 నవంబర్ 14న నిర్మల్ చైన్‌గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చైన్‌గేట్ వద్ద అనాథగా.. ఏ పట్టింపులేకుండా ఉంది. అన్నీ తెలిసి కూడా స్థానిక పాలకులు కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరం. రాంజీ గోండు పేరిట మ్యూజియం ఏర్పాటు చేస్తామని.. ప్రభుత్వాలు ఇచ్చిన మాట కూడా కాలగర్భంలో కలిసిపోయింది. నాటి వీరుల గాథలు, వారి అసమాన ప్రాణత్యాగాల గురించి పట్టించుకునే వారు లేరు. అసలు చాలా మందికి వీటిపై అవగాహన లేకపోగా.. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అమరులకు స్థానం కల్పించలేదు. ఏళ్లు గడుస్తుండగా.. ఘనమైన చరిత్రకు చెదలు పడుతుండగా.. ఈ నెల 17న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తుండటంతో మరోసారి తెరపైకి చర్చ వచ్చింది.
- Tags
- adilabad