అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేది.?

by Aamani |
అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేది.?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ‘మేం చెప్పిందే వేదం.. మేం చేసేదే శాసనం.. మా మాట వినకుంటే వేటు తప్పదు..’ ఇదీ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు, వారి కీలక అనుచరుల తీరు. అధికార పార్టీలో కొందరు నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే రాజకీయంగా దారులు సుగమం చేసుకుంటున్నారు. భవిష్యత్​లో తమకు పోటీ లేకుండా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ పార్టీతో పాటు విపక్ష, స్వతంత్ర సర్పంచ్​లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు తాము చెప్పినట్లే వినాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. తమకు అధిక నిధులు ఇవ్వాలని.. తాము చెప్పిన చోటే వ్యయం చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్వతంత్ర, విపక్ష ప్రజాప్రతినిధులు పార్టీలో చేరాల్సిందేనని.. చేరని వారిపై ఫిర్యాదులు చేయించి, అధికారులతో చర్యలు తీసుకునేలా కుట్రలు చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వంలో తమదే పెత్తనం కొనసాగేలా వ్యవహరిస్తున్నారు.

2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఓ మండలంలో ఓ మహిళ స్వతంత్రంగా పోటీ చేసి జెడ్పీటీసీగా విజయం సాధించారు. తర్వాత జెడ్పీ చైర్​పర్సన్​ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు పలికి టీఆర్ఎస్​కు అనుబంధ సభ్యురాలిగా ఉన్నారు. సదరు మండలంలో మంచి పేరు, పట్టుండగా.. అధికార, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జెడ్పీటీసీగా గెలిచాక మండలంలోని అన్ని గ్రామాల్లో ఎక్కువగా పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి నుంచి అడ్డంకులు మొదలయ్యాయి. మండలం, గ్రామాల్లో అధికారులు, అధికార పార్టీ నాయకులు సహకరించొద్దని, వారు వస్తే ఎవరూ వెళ్లొద్దనే హుకం జారీ చేయడంతో విషయాన్ని మంత్రి, జెడ్పీ ఛైర్మన్ వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో పార్టీని వీడి వేరే పార్టీలో చేరారు.

ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గ కేంద్రమైన మేజర్ గ్రామ పంచాయతీకి 2019 లో జరిగిన ఎన్నికల్లో ఓ వ్యక్తి ఇండిపెండెంట్​గా పోటీ చేసి సర్పంచిగా గెలుపొందారు. హైదరాబాద్​లో సాఫ్ట్ వేర్​ఉద్యోగం చేసే ఆయనకు గ్రామంలో మంచి పేరు ఉండడంతో స్థానికులు ఆయనకు మద్దతు పలికారు. అప్పడు ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో మొదటి నుంచీ ఆయనను అధికార పార్టీ నాయకులు టార్గెట్​చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే పనుల విషయంలో వివాదానికి దిగారు. వార్డు సభ్యులతో ఫిర్యాదులు చేయించడం, కార్యదర్శులను తమకు అనుకూలంగా మలుచుకుని ఇబ్బందులకు గురి చేశారు. చివరికి సదరు సర్పంచిని తొలగించగా.. హైకోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికార పార్టీ నాయకులు కొందరు.. నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి అండతో అధికారులపై ఒత్తిడి చేసి తొలగించారనే విమర్శలూ ఉన్నాయి. వారు చెప్పినట్లు పనులు ఇవ్వకపోవడం, అధికార పార్టీలో చేరకపోవడంతో చివరికి సర్పంచి పదవికి ఎసరు పెట్టడం గమనార్హం.

తానూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి అధికార పార్టీ సీనియర్ నాయకుడి కుటుంబం నుంచి ఒకరు సర్పంచ్​గా గెలువగా.. నియోజక వర్గంలోని కీలక ప్రజాప్రతినిధికి మొదటి నుంచి అండగా ఉన్నారు. అయితే సదరు సర్పంచి, వారి కుటుంబీకులు తమకు అనుకూలంగా లేరని.. అదే పార్టీలోని మరో వర్గం నాయకులు వారిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో వీరికి వ్యతిరేకంగా మరొకరిని సర్పంచిగా నిలబెట్టినా గెలువలేదు. దీంతో వారి ద్వారా వీరిపై ఫిర్యాదులు చేయించి.. అధికారులపై ఒత్తిడి చేయించి విచారణ పేరిట వేధిస్తున్నారు. ఒక్క ఫిర్యాదు కూడా నిజమని తేలకపోవడంతో చివరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టించే కుట్రలు చేస్తుండటం గమనార్హం. ఈ విషయాన్ని నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వరకు తీసుకెళ్లినా.. ఫలితం లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ వేటలో సదరు సర్పంచి, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే..

ఇలా సొంత పార్టీతో పాటు విపక్షాలు, స్వతంత్రంగా గెలిచిన మండల, గ్రామ స్థాయి నాయకులను లక్ష్యంగా చేసుకోగా.. వారిని రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా ఇప్పటి నుంచి అడ్డుకట్ట వేస్తున్నారు. తమకు చెప్పనిదే వారి పనులు చేయవద్దని కొందరు ఎమ్మెల్యేలు మండల, జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. గ్రామాలు, మండలంలో పర్యటిస్తే.. సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర నాయకులు వెళ్లొద్దని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేం లేక కొందరు ఎమ్మెల్యేలకు సరెండర్ అయి.. వారు చెప్పినట్లు నడుచుకోగా, మరికొందరు ఏకంగా పార్టీ వీడి వేరే పార్టీలో చేరుతున్నారు. మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకులదీ అదే పరిస్థితి. ఎమ్మెల్యేలకు కీలక అనుచరులుగా ఉన్న వారు.. ప్రతి మండలంలో ఇద్దరు ముగ్గురు మాత్రమే. వీరు తమ పార్టీతో పాటు విపక్ష, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తాము చెప్పినట్లు నడవాలనే నిబంధన పెట్టారు. తమకు నిధులు ఇవ్వాలని, తాము చెప్పిన చోట వ్యయం చేయాలని, తాము చెప్పినట్లు నడవాలనే నిబంధనలు పెడుతున్నారు. వినని వారిపై ఫిర్యాదులు చేయించి.. అధికారులపై ఒత్తిడి చేయించి పదవుల నుంచి తొలగించేలా, చర్యలు తీసుకునేలా పావులు కదుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed