నా ఆనందానికి అవధుల్లేవు: మంత్రి హరీశ్

by Shyam |
నా ఆనందానికి అవధుల్లేవు: మంత్రి హరీశ్
X

దిశ, మెదక్: గోదావరి జలాలతో ఉద్యమ పురిటి గడ్డ పునీతమైందని, తన ఆనందానికి అవధులు లేవని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష ఫలించి.. దశాబ్దాల కల సాకారమయ్యిందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట ప్రాంతం రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా ఉండేదని, సమైక్య రాష్ట్రంలో సిద్దిపేట ప్రాంత రైతులు సాగునీరు గురించి ఎన్నిసార్లు కోరినా అప్పటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు కరెంట్ కష్టాలతో తల్లడిల్లారని పేర్కొన్నారు. పంటలకు సాగునీరు లేక రైతులు బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఎన్ని బోర్లు వేసినా నీరందక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దుబ్బాక ప్రాంతంలో ఎన్నో ఆకలి చావులు జరిగాయని అన్నారు.

వారి త్యాగాలు మరువలేనివి…

ప్రాజెక్టు భూసేకరణ చరిత్రలో ఒక్క కేసు లేకుండా ఎన్నడూ లేని విధంగా భూములిచ్చిన నిర్వాసితులకు తక్షణమే నష్ట పరిహారం చెక్కులను అందజేశామని మంత్రి చెప్పారు. భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, వారి త్యాగాలు మరువలేనివని, త్యాగాలు చేసిన రైతుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయని హరీశ్ రావు చెప్పారు. మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపునకు గురైన రైతుల కుటుంబాలకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం చెలించామని తెలిపారు. వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద యుద్ధ ప్రాతిపదికన ఇండ్లను నిర్మించి ఇచ్చామని, కుటుంబంలో పెళ్లైన యువతీ, యువకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, నిర్మించిన ప్రాజెక్టుల్లో చేపలు పట్టుకునే హక్కును ఆయా గ్రామాల రైతులకు చెందేలా చూశామని వివరించారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట నియోజకవర్గంలో 71 వేల 516 ఎకరాలకు సాగునీరందుతదని, నియోజకవర్గంలో చెరువులను, కుంటలను పూర్తి స్థాయిలో నింపుతామన్నారు.

ఆందోళన అనవసరం…

ఇక రైతులు వానలు, కరెంటు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదని, బోరు వేస్తే నీళ్లు పడతాయా లేదా అని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని, మూడు కాలాలపాటు పంటలు పండించుకునే పరిస్థితి ఏర్పడుతుందని హరీశ్ రావు అన్నారు. కాలువల ద్వారా వచ్చే నీటితో రైతుల భూముల్లో పసిడి పంటలు పండుతాయని చెప్పారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం, ఉచిత కరెంట్, సాగునీరు ప్రభుత్వం ద్వారా సమకూరడం వల్ల ఇక రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏ మాత్రం ఉండబోదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల చేపల పెంపకం పెరిగి మత్స్యకారుల జీవుతాల్లో వెలుగులు నిండుతాయని, పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతమైందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మహా జలయజ్ఞములో భాగస్వామ్యం అయ్యే మహాభాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకంటే పొందే సంతృప్తి మరింకేమీ ఉండదని, నా జన్మధన్యమైందని భావిస్తున్నాను అని హరీశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమై మనందరి కృషి ఫలించి, ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టమని, ఇది సీఎం కేసీఆర్ , తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఒక గొప్ప నిదర్శనం అని మంత్రి చెప్పుకొచ్చారు.

Tags: Medak, Ranganayaka Sagar Project, Godavari Water, Harish Rao, CM KCR, Farmers

Advertisement

Next Story

Most Viewed