కొవ్వు కొవ్వొత్తిలా కరగాలంటే…

by sudharani |   ( Updated:2020-11-11 21:11:35.0  )
కొవ్వు కొవ్వొత్తిలా కరగాలంటే…
X

దిశ,వెబ్ డెస్క్: మనలో చాలా మందికి అధిక కేలరీలతో నిండిన జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు తెలియకుండానే శరీరంలో అధిక కొవ్వులు, క్యాలరీలు చేరుతున్నాయి. ఫలితంగా చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ వస్తోంది. మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకునేందుకు అనేక రకాల వ్యాయామాలను చేస్తుంటాం. కానీ చాలా సందర్బాల్లో అనుకున్న ఫలితాన్ని మాత్రం సాధించలేకపోతుంటాం. దీనికి సరైన పరిష్కారమే లేదా అని బాధపడుతుంటాం. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ…

పొట్టదగ్గర కొవ్వు పెరగడానికి కారణాలు...
హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయని చెబుతున్నారు. ఫలితంగా పొట్ట చుట్టూ కొవ్వు వృద్ది చెందుతుందని అంటున్నారు. ఊబకాయం అనేది జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొవ్వులు పెరగడానికి అధిక కెలరీలు ఉన్న ఫుడ్, ఒత్తిడి కూడా కారణమని కొన్ని పరిశోధనల్లో తేలింది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి…
ఆహారంలో కొద్ది పాటి మార్పుల చేయడం ద్వారా కొవ్వు తగ్గించుకోవడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే పండ్లలో చాలా తక్కువ కాలరీలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సిట్రస్ జాతికి చెందిన నారింజ, నిమ్మకాయ, కివీ లాంటివి మెటబాలిజంను పెంచుతాయి. ఇతర ఆమ్లాలతో పోల్చినప్పుడు కొవ్వును కరిగించే గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లనేవి బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే అధిక ప్రోటీన్లు కలిగిన పెరుగు, మజ్జిగను తాగటం మంచింది. అయితే కృత్రిమంగా లభించే ప్రోటీన్ల కన్నా సహజంగా దొరికే ప్రోటీన్లను తీసుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొవ్వులను తగ్గించుకోవచ్చు. కొవ్వులు తగ్గించుకోవాలనుకున్న వారు ఒత్తిడిపై దృష్టి సారించాలని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేక పోవడం వల్ల కార్టిసోల్ స్థాయి పెరుగుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వు పెరగడంలో దోహదపడుతుంది. నిద్ర అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది, మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. అందుకే తగినంత సమయం నిద్రపోవడం మంచిది.

ఇక భోజనం చేసే టప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. రోజుకు మూడు సార్లు అధిక మొత్తంలో భోజనం తినడం కన్నా ఆరు సార్లు చిన్నగా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక రోజూ నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. నీరు అనేది జీవక్రియలను వేగవంతం చేసేందుకు, శరీరం నుంచి విషపదార్థాలను వేరుచేసేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో బాగా ఉపయోగ పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.

ఇక శరీరంలో కొవ్వును తగ్గించుకునేందుకు కొన్ని రకాల వ్యాయామాలు చేయడం తప్పని సరి అని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా కార్డియోవాస్క్యులర్ వ్యాయామాలు అనేవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. బరువు తగ్గించడంలో సహాయ పడుతాయి. వాటిలో ప్రత్యేకంగా జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయడం వల్ల అధ్బుతమైన ఫలితాలు ఉంటాయి. రోజు 30 నిమిషాల నడక కూడా జీవక్రియను అధికం చేసేందుకు ఉపయోగపడుతుంది. పొట్ట దగ్గర అదనపు కొవ్వును కరిగించడంలో సహాయ పడుతుంది. ఈ అంశాలన్నింటిపై దృష్టి సారించి అంకిత భావంతో పనిచేస్తే పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకోవచ్చు.

Advertisement

Next Story