ఇంటి‌గ్రేటెడ్ టౌన్‌షిప్ కార్యరూపంలోకి వచ్చేనా.!?

by Shyam |   ( Updated:2020-10-12 00:50:50.0  )
ఇంటి‌గ్రేటెడ్ టౌన్‌షిప్ కార్యరూపంలోకి వచ్చేనా.!?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతంలో సమీక‌ృత పట్టణం(ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్) ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే, ఇదేమి కొత్త పథకం కాదని ప్రభుత్వ అధికారులే వెల్లడిస్తున్నారు. వాస్తవానికి అథారిటీ వద్ద ఈ తరహా పథకాలు ప్రతిపాదించబడినవి చాలానే ఉన్నాయి. ఉప్పల్ భగాయత్‌లో 76 ఎకరాల్లో భారీ విస్తీర్ణంతో ప్లాట్లను చేసిన అథారిటీ బహుళ అంతస్థుల భవనాల నిర్మణాలను ప్రోత్సహించాలని ప్రతిపాదించింది.

ఔటర్ రింగ్ రోడ్ చుట్టూర ఉన్న 13 పట్టణాలను శాటిలైట్ టౌన్‌షిప్ (ట్రాన్సిట్ ఓరియంట్ గ్రోత్ సెంటర్స్)‌లు చేయాలనే ప్రతిపాదన ఉన్నది. ఇవి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లోనూ ఉదహరించబడ్డాయి. హైదరాబాద్ సిటీలో ట్రాన్సిట్ ఓరియంట్ డెవలప్‌మెంట్(టీవోడీ) పథకాలు చాలానే ఉన్నాయి. తెల్లాపూర్ టెక్నో సిటీ, మహేశ్వరంలో డిస్కవరీ సిటీ, ఘట్‌కేసర్, కీసర పరిధిలో గ్రీన్ ఫీల్డ్‌సిటీ అనే పలు రకాల టౌన్‌షిప్‌లు, గండిపేట సుందరీకరణ, కొత్వాల్‌గూడలో నైట్ సఫారీ, ఔటర్ రింగ్ రోడ్ పథకంలో భాగమైన ఇంటర్ చేంజెస్‌లో వేసైడ్ ఎమినిటీస్ వంటివి ప్రకటనల్లో నానుతున్నాయి.

కానీ, ఏ ఒక్కటి కార్యరూపంలోకి రావడంలేదు. ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ తీసుకొచ్చేందుకు హెచ్ఎండీఏ చట్టసవరణ బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హెచ్ఎండీఏ చట్టంలో స్పష్టంగా ఉన్నా భూసమీకరణ పథకం(ల్యాండ్ పూలింగ్ స్కీం)ను కేవలం ఒక్క ఉప్పల్ భగాయత్‌లో మాత్రమే చేపట్టి ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతోన్న అథారిటీ ఇప్పుడు ఈ కొత్త టౌన్‌షిప్‌తో నగర శివారులో రావడం మాటెలా ఉన్నా..ప్రచారానికే పెద్ద‌పీట ఉంటుందని అధికారులే ఉదహరిస్తున్నారు.

పర్యావరణహిత టౌన్‌షిప్..

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ ప్రధానంగా 100 ఎకరాలకు పైబడిన భూవిస్తీర్ణంలో కనీసం 1,500 కుటుంబాలకు సౌకర్యవంతంగా నివసించేందుకు వీలుగా నిర్మాణం చేస్తారు. కనీసంగా 2.50 లక్షల చ.మీ.ల బిల్టప్ ప్రాంతం ఉండేలా చూస్తారు. భూవినియోగాన్ని అర్థవంతంగానూ, ఆర్థికపరమైన అంశాలకు అధికశాతం ఉండేలా చూస్తారు. సేంద్రియ వ్యర్థాలను పునర్వినియోగంపై ప్రత్యేక ప్రణాళికలను రచిస్తారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.

విశాలమైన రహదారులు, పార్కింగ్, క్రీడా మైదానం, కృత్రిమ సరస్సు, నడకదారులు, ఉద్యానవనాలు, వినోదాత్మక కార్యక్రమాల నిర్వహాణకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, హెచ్ఎంఆర్ అందుబాటులో ఉండటంతో అథారిటీ విస్తరిత ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని అథారిటీ చట్ట సవరణ చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

లేఅవుట్లే… టౌన్‌షిప్‌లు..

ప్రస్తుతం నగరం చుట్టూర హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ స్కీంతో భారీ లేఅవుట్లను కార్యరూపంలోకి తీసుకొస్తున్నది. ఈ స్కీం ద్వారా ఏర్పడే భారీ లేఅవుట్లను టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేసే దిశగా సర్కారు దృష్టి సారించినట్లు అధికారుల అభిప్రాయం. ఈ టౌన్‌షిప్‌ల రాకతో నగర శివారు ప్రాంతాల్లో అత్యాధునిక రావాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా నగరంలో ట్రాఫిక్ సమస్యకు ఓ పరిష్కారముంటుంది. శివారు ప్రాంతం ప్రణాళికాబద్ధంగానూ అభివృద్ది చెందుతుందనేది ప్రభుత్వ యోచన.

నగరం చుట్టూర ఔటర్ రింగ్‌రోడ్, మెట్రో రైలును అధికంగా వినియోగించుకునేలా, నగరంలోకి వెహికల్స్ తక్కువగా ప్రవేశించేలా చేసేందుకు ఈ టౌన్‌షిప్‌ల ప్రతిపాదన తెరపైకి వచ్చిందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. నగరంలోకి వచ్చే శివారు ప్రాంతవాసులు, జిల్లాల ప్రజలు అధికంగా ప్రజా రవాణా వ్యవస్థలోనే రాకపోకలు చేసేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దేశంలో ఈ తరహా టౌన్‌షిప్‌లు భద్రాచలం, పూణే, సూరత్ వంటి నగరాల్లో ఉన్నాయి.

Advertisement

Next Story