AP News : ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ జీవో సస్పెండ్

by srinivas |
AP News : ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. ఆ జీవో సస్పెండ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులను నియమించిందని పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇలా ప్రత్యేక ఆహ్వానితుల జాబితా పెద్దగా ఉండటం వల్ల వారి సిఫారసులు..ఇతరత్రా వ్యవహారాలలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాదనలు వినిపించారు.

అయితే ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సమర్థించేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ జీవోను తాత్కాలిక నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి నియమించింది ప్రభుత్వం. 25 మంది పాలకమండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులతోపాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. అయితే ప్రత్యేక ఆహ్వానితులకు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోగానీ…పాలక మండలి సమావేశాల్లో గానీ పాల్గొనే అవకాశం లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంబో బోర్డులో నేరచరిత్ర కలిగిన వారు.. రాజకీయ నిరుద్యోగులు ఉన్నారంటూ పలువురు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story