రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు.. అదనపు కలెక్టర్

by Sumithra |
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు.. అదనపు కలెక్టర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం అదనపు కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల పై చర్చించారు. జిల్లా మీదుగా ప్రధాన జాతీయ రహదారులు వెళ్తుండడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నందున, వాటికి ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా పరిగణిస్తూ, ప్రమాదాలకు దారి తీస్తున్న కారణాలను గుర్తించాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బీ, రోడ్ ట్రాన్స్ పోర్ట్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇప్పటికే కొన్ని బ్లాక్ స్పాట్ల వద్ద చర్యలు తీసుకున్న ఫలితంగా గత జూన్ నెల నుండి చూస్తే కొంత వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అదనపు కలెక్టర్ తెలిపారు.

మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు సహా, ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా చర్యలు విధిగా పాటించేలా నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ ముఖ్య కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల పై ధాన్యం, మొక్కజొన్న ఆరబెడుతుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున రైతులకు అవగాహన కల్పించాలని, వారికి డ్రై ప్లాట్ ఫారంలను విరివిగా మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సూచించారు. నగరంలో వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్సా ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed