ఆర్టీసీకి భారీ షాక్.. నిధులు ఇవ్వలేమంటూ సంకేతాలు

by Shyam |   ( Updated:2021-05-29 20:08:14.0  )
ఆర్టీసీకి భారీ షాక్.. నిధులు ఇవ్వలేమంటూ సంకేతాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీకి నిధులు ఇవ్వలేమంటూ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1500 కోట్లు కేటాయించినా.. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూపాయి ఇవ్వలేమంటూ తేల్చింది. ప్రస్తుతం వేతనాలకు కూడా ఆర్టీసీ ఖాతాలో రూపాయి లేదు. గత నెలలోనే దాదాపు 12వ తేదీ తర్వాత జీతాలు జమ చేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం నుంచి రూ. 100 కోట్లు రావడంతో అక్కడా.. ఇక్కడా సర్దుబాటు చేసి ఒక్కో డిపోలో ఒక్కో రోజున వేతనాలిచ్చారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఈ నెల కూడా ఆదాయం రాలేదు. రోజుకు ఆర్టీసీ మొత్తం ఆదాయం కనీసం రూ. 10 లక్షలు కూడా చేరుకోవడంలేదు. దీంతో నిర్వహణకే సంస్థ ఖాతా నుంచి వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా వేతనాలు, నిర్వహణ కోసం ఆర్టీసీ యాజమాన్యం.. ప్రభుత్వం వైపే చూడాల్సి వస్తున్నది. దీన్ని ముందే గుర్తించిన ప్రభుత్వం.. తామే ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, ఆర్టీసీకి నిధులు ఇచ్చే పరిస్థితి లేదంటూ చెప్పకనే చెప్పింది.

రూ. వెయ్యి కోట్ల రుణం..

ఆర్టీసీ కార్మికుల వేతనాలు, సీసీఎస్ చెల్లింపులు, దాదాపు రెండేండ్లుగా రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అన్నీ పెండింగ్​ ఉంటున్నాయి. వీటిని చెల్లించేందుకు ఆర్టీసీకి వివిధ కమర్షియల్​బ్యాంకుల నుంచి రూ. 2 శాతం వడ్డీతో రూ. 1000 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటామని సూచించింది. ఆర్టీసీకి అత్యవసర నిధుల కోసం ఈ రుణం తీసుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చే ఆశలను కొట్టిపారేసినట్లైంది.

ప్రభుత్వానికి ధన్యవాదాలు : థామస్​రెడ్డి, టీఎంయూ జనరల్ సెక్రటరీ

కాగా ఆర్టీసీ కార్మికుల కోసం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని టీఎంయూ జనరల్​సెక్రటరీ థామస్​రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వ్యాక్సిన్ వేయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అదే విధంగా టీఎంయూ వినతిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ చెల్లింపులు, రిటైర్డ్ ఉద్యోగుల అత్యవసర చెల్లింపుల కోసం రూ. 1000 కోట్ల బ్యాంకు గ్యారంటీకి అనుమతిచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుతున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed