గెలిస్తే జనవరి.. బీజేపీకి పట్టంకడితే ఫిబ్రవరి..

by Anukaran |   ( Updated:2020-11-10 11:15:29.0  )
గెలిస్తే జనవరి.. బీజేపీకి పట్టంకడితే ఫిబ్రవరి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్​లో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొటాపోటీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్స్ ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఒక్కొక్కరి స్టేట్మెంట్ ఒక్కో రకంగా ఉంటుంది. ఈ నెల 13 తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడైనా ఉండొచ్చునన్న ఎన్నికల కమిషన్ కు విరుద్ధంగా టీఆర్ఎస్, ప్రభుత్వ వర్గాలు నిర్ధిష్ట కాల పరిమితిలోనే జరుగుతాయని ప్రకటించాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపైనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆధారపడినట్లు తెలుస్తోంది. అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అంచనాకు ఎవరూ రాలేకపోతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఉంది.

ఈ క్రమంలో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయేనంటూ అనేక సర్వేలు, విశ్లేషణల ద్వారా తెలుస్తున్నది. ఈ ఫలితాలే అధికార పార్టీ నిర్ణయాన్ని తేల్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఇప్పుడప్పుడే కార్పొరేషన్ ఎన్నికలకు పోవద్దంటూ టీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మొరపెట్టుకున్నారన్న ప్రచారం ఉంది. ముంపు ప్రాంతాలు కోలుకోక ముందే, ముంపు నష్టాన్ని, కష్టాన్ని మర్చిపోకముందే వాళ్ల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగే పరిస్థితి ఉండదంటూ వారి ఆందోళనను వెల్లగక్కినట్లు సమాచారం. పైగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకున్నదన్న సర్వే రిపోర్టులు అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయని ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పారు.

సోమవారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో టీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓవైసీ బుల్లెట్ పైనే ప్రగతి భవన్ కు చేరుకున్నారన్న ప్రచారం జరిగింది. ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​ కు, ఎంఐఎంకు మిత్రబంధం ఉంటుంది. ఎక్కడైనా టీఆర్ఎస్ అభ్యర్థులు నిలిచినా ఫ్రెండ్లీ కాంటెస్టుగానే ఉంటుంది. అయితే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య విభేదాలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, అక్కడి ఎంఐఎం నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. అందుకే ఎంఐఎంతో పొత్తు, స్నేహబంధం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిని నిలబెట్టాల్సిందే.. గెలిపించాల్సిందేనంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తన కార్యకర్తలు, ముఖ్యమైన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. ఏదేమైనా నేడు తేలనున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలే బల్దియా ఎన్నికలు ఎప్పుడనేది తేల్చేస్తుందంటున్నారు.

అందుకే వరద సాయం

గత నెలలో కురిసిన వర్షాలకు నగరం కొట్టుకుపోయినంత పని అయింది. అయితే అధికార పార్టీకి లాభాన్ని చేకూర్చినట్లుగా కనిపిస్తోంది. ముంపునకు గురైన కుటుంబాలకు రూ.10 వేలు ఇచ్చే నష్టపరిహారం ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందికి ఇచ్చారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు దగ్గరుండి పంపిణీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. అధికారులెవరైనా వినకపోతే ధూషణలు తప్పడం లేదు. ఇటీవల ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఓ డివిజన్ లో బల్దియా అధికారి కంట నీరు పెట్టారని తెలిసింది. అక్కడి కార్పొరేటర్ వందలాది మంది ముందు ఆ అధికారిని దుర్భాషలాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులంతా ధర్నా చేస్తున్న స్థలానికి అధికారిని కార్పొరేటర్ పిలిపించారు. ఆ తర్వాత తమకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వరంటూ అధికారిపై విరుచుకుపడ్డారు. తోపులాటలో అధికారి చొక్కా కూడా చిరిగిందని తెలిసింది.

అయితే త్వరలోనే రిటైర్మెంట్ ఉండడంతో కేసుల జోలికి పోలేదని టీఆర్ఎస్ నాయకుడొకరు చెప్పారు. స్థానిక కార్పొరేటర్ నోటి దురుసుతనంతో ఓ మహిళా అధికారి కూడా విధులకు రావడం లేదు. అక్కడి నుంచి బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. అయితే పరిహారం అధికారికంగా ఎవరెవరికి ఇచ్చారన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆఖరికి ఎంపీ రేవంత్ రెడ్డి అధికారులను అడిగినా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుండడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ముంపునకు గురికాకపోయినా చాలా కాలనీలు, బస్తీల్లో నష్టపరిహారాన్ని ఫలహారంగా పంచి పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ముంపు బాధితుల నుంచి కూడా సగం వరకు టీఆర్ఎస్​ కార్యకర్తలు, నాయకులే మింగేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అతి పెద్ద స్కాంగా అభివర్ణిస్తున్నారు. అందుకే సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ పట్టు పడుతున్నారు.

Advertisement

Next Story