నిషేధాన్ని తిరస్కరిస్తున్నాం.. ప్రభుత్వ జీవోను తప్పుపట్టిన మేధావులు

by Shyam |
నిషేధాన్ని తిరస్కరిస్తున్నాం.. ప్రభుత్వ జీవోను తప్పుపట్టిన మేధావులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపిస్తూ పదహారు ప్రజా సంఘాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తిరస్కరిస్తున్నామని మేధావులు ప్రకటించారు. పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన అవకాశాలను, హక్కులను నేరంగా ఆపాదిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న తెలంగాణ ప్రభుత్వం తక్షణం ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని పత్రికలకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ విప్లవ రచయితల సంఘాన్ని ప్రభుత్వం నిషేధించిందని, పబ్లిక్ సెక్యూరిటీ యాక్టుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకున్నా అందుకు సహేతుక వాదనలను వినిపించుకోలేకపోయిందని, కనీస సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని, అందువల్ల న్యాయ సలహా మండలి సిఫారసు మేరకు నిషేధపు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని పదిహేను మంది కవులు, మేధావులు ఆ ప్రకటనలో గుర్తుచేశారు.

విప్లవ రచయితల సంఘంతో పాటు పదహారు ప్రజా సంఘాలు దశాబ్దాలుగా ప్రజా జీవితంలోని వేర్వేరు జీవన పార్శ్వాల్లో నిబద్ధతతో పనిచేస్తున్నాయని, ప్రజల పక్షాన పనిచేస్తున్నాయని, ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం నిషేధపు ఉత్తర్వులకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను వివిధ రూపాల్లో ప్రశ్నించినందుకే పాలకులకు ఆగ్రహం కలిగిందని ఆరోపించారు. ఈ ప్రజా సంఘాలు చట్టవ్యతిరేకమైనవని ప్రభుత్వం భావించినట్లయితే తొలుత ఆయా సంఘాలకు తెలియజేయాల్సి ఉంటుందని, ఎందుకు ఇలా నిషేధం విధించాల్సి వచ్చిందో వివరించాల్సి ఉంటుందని, ఆయా సంఘాల వాదనలను, అభ్యంతరాలను స్వీకరించడానికి మూడు నెలల గడువు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వం రూపొందించిన చట్టంలోనే ఈ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జీవో నెం.73 జారీ చేసిందని వారు గుర్తుచేశారు. చట్టవ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story