విజయవాడ ఫాతిమా యూపీలో దారుణ హత్య.. ఆ ఆహ్వానమే ప్రాణం తీసిందా!

by srinivas |   ( Updated:2021-08-10 07:27:00.0  )
విజయవాడ ఫాతిమా యూపీలో దారుణ హత్య.. ఆ ఆహ్వానమే ప్రాణం తీసిందా!
X

దిశ, ఏపీ బ్యూరో: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ప్రియుడు తన స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక పెళ్లి చేసుకుందాం రా అని పిలిచాడు. దీంతో అతడి మాటలు నమ్మిన ప్రియురాలు కన్నవారిని సైతం వదిలేసి అతడి కోసం ఊరుకాని ఊరు వెళ్లింది. చివరకు ప్రేమించినోడు చేతిలోనే హత్యకు గురైంది. చివరకు యమునా నదిలో శవమై తేలింది. ప్రియుడితో జీవించేందుకు ఎన్నో కలలతో యూపీ వెళ్లిన విజయవాడకు చెందిన ఫాతిమా విషాదగాథ ఇది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తస్లీమా ఫాతిమా అనే యువతి స్థానికంగా ఉంటున్న యూపీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది.

అయితే ఇటీవలే అతడు తన స్వస్థలం యూపీకి వెళ్లిపోయాడు. అయితే ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పెళ్లి చేసుకుందాం రా అని ఆహ్వానించడంతో జూలై 10న ఫాతిమా ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పకుండా తనకు సంబంధించిన డబ్బు, బంగారం తీసుకుని యూపీ వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఫాతిమా యూపీలోని యమునా నది తీరంలో శవమై తేలినట్లు గుర్తించారు. దీంతో కొత్తపేట పోలీసులు యూపీ వెళ్లారు. యూపీ పోలీసులతో చర్చించారు. అప్పటికే యూపీ పోలీసులు హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సంపాదించారు. సెల్ ఫోన్‌ సంభాషణల ఆధారంగా ప్రియుడు ఆచూకీ తెలుసుకున్నారు. అయితే ప్రియుడు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

అయితే పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా తానే హత్య చేసినట్లు ప్రియుడు అంగీకరించాడు. తనకోసమే ఫాతిమా ఇక్కడకు వచ్చిందని వచ్చిన తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమె వద్ద ఉన్న నగలు, నగదు తీసుకుని ఇద్దరం కలిసి ఆమెను యమునా నదిలో తోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇద్దరిని పోలీసులు రైలులో విజయవాడ తీసుకువచ్చారు. అనంతరం మంగళవారం కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Next Story