రాష్ట్రపతి చేతికి 15వ ఆర్థిక సంఘం నివేదిక

by Anukaran |
రాష్ట్రపతి చేతికి 15వ ఆర్థిక సంఘం నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో : 15వ ఆర్థిక సంఘం పూర్తిస్థాయి నివేదికను రాష్ట్రపతికి సోమవారం సమర్పించింది. రానున్న నాలుగేళ్ళలో ఆర్థిక రంగంలో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం, రాష్ట్రాల అవసరాలు, సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలన్నింటినీ ఈ నివేదికలో పొందుపర్చింది. మొత్తం ఐదేళ్ళకు సంబంధించిన నివేదికను సమర్పించాల్సి ఉన్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి విడిగా నివేదికను ఇప్పటికే సమర్పించగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

2021-22 నుంచి 2025-26 మధ్య నాలుగేళ్ళ కాలానికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను నాలుగు సంపుటాలుగా ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని కమిషన్ రాష్ట్రపతికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం అక్టోబరు చివరికల్లా ఈ నివేదికను సమర్పించాల్సి ఉన్నా పది రోజులు ఆలస్యంగా అందజేసింది.

రాష్ట్రాల నుంచి వసూలయ్యే పన్నుల్లో ఏ నిష్పత్తిలో తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి, స్థానిక పరిపాలనా సంస్థలకు నిధులను ఏ మోతాదులో ఇవ్వాలి, విపత్తు నిర్వహణ నిధికి ఏ మేరకు కేటాయింపులు చేయాలి, విద్యుత్ రంగంలో ఉత్తమ ఫలితాలను సాధించిన రాష్ట్రాలకు ఇచ్చే ప్రోత్సహకాలకు అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం పనితీరుకు ఇచ్చే ఇన్సెంటివ్‌లు, ఘన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం లాంటి అనేక అంశాలను ఈ నివేదికలో పొందుపర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఆ ప్రకారం మొదటి, రెండవ సంపుటిలలో ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు కమిషన్ పేర్కొంది.

మూడవ సంపుటిలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థల అవసరాలను సుదీర్ఘంగా చర్చించి సిఫారసులు చేసినట్లు తెలిపింది. ఎదుర్కొనే సవాళ్ళు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు తదితరాలన్నింటినీ నిర్దిష్టంగా రోడ్‌మ్యాప్ రూపంలో ప్రస్తావించినట్లు తెలిపింది. ఇక నాల్గవ సంపుటి పూర్తిగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, ఎదుర్కొనే సవాళ్ళు, ఆయా రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు తదితరాలను వివరించినట్లు తెలిపింది.

రాష్ట్రపతి పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత ఇందులోని వివరాలు పబ్లిక్ డొమెయిన్‌లోకి వస్తాయి. కరోనా పరిస్థితుల్లో రూపొందించిన నివేదిక కావడంతో ప్రధాన సంపుటిలో ‘ఫైనాన్స్ కమిషన్ ఇన్ కొవిడ్ టైమ్స్’ అనే టైటిల్‌ను ఆర్థిక సంఘం ఖరారు చేసింది.

Advertisement

Next Story

Most Viewed