వన్యప్రాణుల సంరక్షణకు జూ అధికారుల ముందస్తు చర్యలు

by Mahesh |
వన్యప్రాణుల సంరక్షణకు జూ అధికారుల ముందస్తు చర్యలు
X

దిశ, బహదూర్ పుర: మొన్నటి వరకు చలికి ఇబ్బంది పడుతున్న వన్యప్రాణులకు సంప్రదాయబద్దంగా వెచ్చదనాన్ని సమకూర్చిన అధికారులు ఇప్పుడు సూర్య తాపానికి వడదెబ్బ తగలకుండా వన్యప్రాణుల సంరక్షణకు శీతలీకరణ పద్ధతులను చేపట్టారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఏనుగులు ఉష్ణ తాపాన్ని తట్టుకోవడానికి ఏర్పాటు చేసిన మిస్ట్ వాటర్ షవర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతే కాకుండా సింహాలు, పులుల కొరకు వాటి ఎన్క్లోజర్‌ల వద్ద వడదెబ్బ నుండి సేద తీరడానికి ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. అడవి జంతువులు, పక్షులు, సరీసృపాలు ఇలా ఏ ప్రాణికైనా వడదెబ్బ తగలకుండా వాటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా హెడ్ అనిమల్ కీపర్లు, పార్కు సూపర్వైజర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాబేలు ఇతర సరీసృపాల పై ప్రత్యేకమైన సిబ్బంది నీటి పైపు ద్వారా నీళ్లను విరజిమ్ముతూ వాటి ఉష్ణ తాపాన్ని నివారించడానికి శ్రద్ధ తీసుకుంటున్నారు.

జంతువుల గృహాలపై నేరుగా సూర్యరశ్మి పడకుండా గోనె వస్త్రాలను, గ్రీన్ నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని వన్యప్రాణులకు వడదెబ్బ తగలకుండా సంప్రదాయబద్ధమైన తట్టీలను ఏర్పాటు చేసి తుంగ గడ్డి షెల్టర్‌లకు నీటిని విరజిమ్ముతూ జూ సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. నాలుగు నెలల పాటు సుమారుగా జూన్ చివరి వరకు శీతలీకరణ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మిస్ట్ షవర్లు, వాటర్ షవర్లు, రేయిన్ గన్ లు, ఫాగర్ లతో పాటు ఇతర ఉపకరణాలను ఉపయోగిస్తూ జంతువులు వడదెబ్బకు గురికాకుండా జూ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.

కంటికి రెప్పలా వన్యప్రాణుల సంరక్షణ: రాజశేఖర్

కంటికి రెప్పలా వన్య ప్రాణుల సంరక్షణ చేపడుతున్నామని.. వాటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్ అన్నారు. ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో జూలాజికల్ పార్క్ లో జంతువులు వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణుల ఆలన పాలన విషయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటామని ఆయన తెలిపారు. ప్రతి వన్యప్రాణి విషయంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed