ఎంపీ అవినాశ్ రెడ్డి చాలా మంచోడు: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

by Disha Desk |   ( Updated:2022-03-03 11:31:44.0  )
ఎంపీ అవినాశ్ రెడ్డి చాలా మంచోడు: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ ఇంటి వాళ్లే వివేకాను హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తుంటే... వివేకానందరెడ్డి అల్లుడితో కలిసి టీడీపీయే హత్య చేయించిందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డిని గతంలో ఓసారి వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా మరోసారి వెనకేసుకొచ్చారు. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. అవినాశ్ రెడ్డి నేరం చేసినట్లు న్యాయస్థానం నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి సవాల్ విసిరారు. గతంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని ఇప్పటికీ తాను అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ఈ హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఈ హత్య కేసులో ఇరికిస్తారని తాను ఆరు నెలల క్రితమే చెప్పానని ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయం లేదని ఖరాఖండిగా చెప్పారు. హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే ఇలా నైతికంగా దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనప్పటికీ న్యాయస్థానంలో ఎంపీ అవినాశ్ రెడ్డికి న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story