పవర్ ఆఫ్ 'మ్యాన్‌ప్యాడ్స్'

by samatah |
పవర్ ఆఫ్ మ్యాన్‌ప్యాడ్స్
X

దిశ, ఫీచర్స్ : ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో పోల్చితే రష్యా సైనికులకు ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంత చిన్న చిన్నదేశం రష్యాతో భీకరంగా పోరాడేందుకు ప్రధాన కారణం పశ్చిమ దేశాలిస్తున్న మద్దతు, సమకూరుస్తున్న ఆయుధ సంపత్తి. యుద్ధం ప్రారంభ దశలోనే అమెరికా 600 కంటే ఎక్కువ స్టింగర్ క్షిపణులను, 2600 జావెలిన్స్‌ను పంపించగా.. జర్మనీ, నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా దేశాలు స్టింగర్స్‌ సరఫరా చేశాయి. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ డిఫెన్స్ సిస్టమ్స్ సహా స్నిపర్ రైఫిల్స్, మెషిన్ గన్స్, రైఫిల్స్ కూడా అందజేశాయి. ఇదిలా ఉండగా యూఎస్ అదనంగా $800 మిలియన్ల సైనిక సహాయాన్ని అందించడం సహా 800 స్టింగర్స్‌(మ్యాన్‌ప్యాడ్స్)‌, 2,000 జావెలిన్ యాంటీ ఆర్మర్ సిస్టమ్స్ ఉక్రెయిన్‌కు తాజాగా చేరవేసింది. ఈ తరుణంలో ఉక్రెయిన్ దగ్గరున్న 'మ్యాన్‌ప్యాడ్స్' ఏం చేయగలవు? రష్యా బలగాలను అడ్డుకోవడంలో వీటి పాత్ర ఏంటి? ఆ విశేషాలపై స్పెషల్ స్టోరీ




గగనతలంలోని శత్రు విమానాలు, హెలికాప్టర్స్, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని.. వాటిని కూల్చేసే క్షిపణులే 'మ్యాన్‌ప్యాడ్స్'. దాదాపు మూడు మైళ్ల దూరం నుంచే వీటిని వినియోగించే అవకాశముండగా, రేడియేషన్ ఉద్గారాల ద్వారా లక్ష్యాన్ని గుర్తించే ఒక ఇన్‌ఫ్రారెడ్ సీకర్‌ని ఇవి కలిగి ఉంటాయి. మ్యాన్‌ప్యాడ్స్‌ను ఒక వ్యక్తి భుజంపై లేదా ట్రైపాడ్‌పై అమర్చి టార్గెట్‌ను ఎయిమ్ చేస్తారు. ఈ స్టింగర్స్‌ను అమెరికా రూపొందించగా, రష్యా దగ్గరున్న ఇదే తరహా క్షిపణిని రష్యన్ ఇగ్లా-ఎస్ అని పిలుస్తారు. నిజానికి మ్యాన్‌ప్యాడ్స్ మిసైల్స్ వాయు రక్షణ కోసమే రూపొందించినప్పటికీ అమెరికా తయారు చేసిన జావెలిన్స్‌ను ఉపరితల ట్యాంకులను ధ్వంసం చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి కూడా ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటాయి. ఈ మ్యాన్‌ప్యాడ్స్ వైమానిక దాడుల నుంచి దళాలను రక్షించడంలో సాయపడుతుండగా, తక్కువ-ఎగిరే విమానాలను లక్ష్యంగా చేసుకోవడంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.

ఎన్‌లా (NLAW)

స్వీడన్ తయారుచేసిన 'నెక్స్ట్ జనరేషన్ లైట్ యాంటీ ట్యాంక్ వెపన్స్(NLAW)' కూడా షోల్డర్ -మౌంటెడ్ షార్ట్-రేంజ్ మిసైల్సే. యూకే సరఫరా చేసిన ఈ ఆయుధాలకు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ లేదు కానీ అత్యాధునిక ట్యాంక్ అయినా దీని ధాటికి కుప్పకూలాల్సిందే. మొత్తం 27 పౌండ్ల బరువుండే దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ క్షిపణి 62 అడుగుల నుంచి 2600 అడుగుల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

ఎలా ఉపయోగపడుతున్నాయి?

ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలో మ్యాన్‌ప్యాడ్స్ ముందంజలో ఉండగా, గగనతలంలో రష్యన్లు ఆధిపత్యం చెలాయించకుండా ఉంచడంలో ఇవి విజయవంతమయ్యాయి. ఈ మేరకు ప్రతీ రష్యన్ జెట్, హెలికాప్టర్లను.. కూల్చేస్తున్న మ్యాన్‌ప్యాడ్స్ రష్యన్ వైమానిక దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. BBC నివేదిక ప్రకారం, మార్చి 8 నాటికి కనీసం 20 రష్యన్ విమానాలను ఉక్రెయిన్ క్షిపణుల ద్వారా కూల్చివేసినట్లు పరిశోధకులు ధృవీకరించారు. కాగా ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ మార్చి 17న షేర్ చేసిన తాజా గణాంకాల ప్రకారం రష్యాకు చెందిన 86 విమానాలు, 108 హెలికాప్టర్లను ఛేదించినట్లు వెల్లడించింది. రష్యా మాత్రం ఇప్పటివరకు ఈ లెక్కలపై స్పందించకపోవడం గమనార్హం. ఈ మేరకు ఉక్రెయిన్ మైదానంలో జావెలిన్స్.. రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశ పోరాటానికి చిహ్నంగా మారాయి.

ఆందోళన

ఆస్ట్రేలియన్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, US అభివృద్ధి చేసిన మొదటి మ్యాన్‌ప్యాడ్స్‌‌ను 'రెడీయే' అని పిలుస్తారు. 1968లో తయారుచేస్తున్నట్లు ప్రకటించగా, 1970లో తొలి స్టింగర్ విడుదలైంది. 1980లలో సోవియట్ విమానాలతో పోరాడేందుకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ముజాహిదీన్‌లకు వీటిని అందించారు. సోవియట్‌ కూడా స్ట్రెలా, ఇగ్లా అనే తమ సొంత మ్యాన్‌ప్యాడ్స్ ‌ను అభివృద్ధి చేసుకుంది. ఈ క్రమంలో US, UK, రష్యా, స్వీడన్, ఉత్తర కొరియా, పోలాండ్‌తో పాటు దాదాపు 20 దేశాలు మ్యాన్‌ప్యాడ్స్ ‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే సంవత్సరాలుగా అల్ ఖైదా వంటి తీవ్రవాద సంస్థల చేతుల్లోకి క్షిపణులు చేరడంతో మ్యాన్‌ప్యాడ్స్ అక్రమ విస్తరణపై పలు దేశాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వాస్తవానికి 1975 నుంచి దాదాపు 60 పౌర విమానాలను మ్యాన్‌ప్యాడ్స్ ఉపయోగించి కుప్పకూల్చినట్లు ర్యాండ్ నివేదిక వెల్లడించింది. ఈ ఘటనల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కనీసం 57 నాన్-స్టేట్ ఆర్మ్‌డ్ గ్రూప్స్ (NSAG) మ్యాన్‌ప్యాడ్స్ కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదేవిధంగా 2004లో సద్దాం హుస్సేన్ పతనం తర్వాత ఇరాక్‌లోని స్టాక్‌పైల్‌లో కనీసం 4,000 మ్యాన్‌ప్యాడ్స్ ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇటువంటి అక్రమాల్లో పాలుపంచుకున్నట్లు భావిస్తున్న దేశాల్లో ఇరాన్ ఒకటి కాగా ఆ దేశం మద్దతిచ్చే హిజ్బుల్లా, హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హౌతీ వంటి ఎన్‌ఎస్ఏజీ సంస్థలు వీటిని కొనుగోలు చేసినట్లుగా నివేదిక పేర్కొంది. ఈ మేరకు అదనపు క్షిపణి వ్యవస్థలను భద్రపరచడంతోపాటు మాన్‌ప్యాడ్స్‌ను పొందకుండా ఉగ్రవాదులను ఆర్థికంగా నిరోధించడం వంటి ఈ విస్తరణను ఎదుర్కోవడానికి దేశం భారీ సమన్వయ ప్రయత్నాలను చేస్తోందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

MANPADS సరిపోతాయా?

కాల్పుల విరమణ కోసం చర్చలు ఫలించకపోవడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. తమ దేశంపై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయమని ఆమెరికా సహా దాని మిత్రదేశాలకు పదేపదే పిలుపునిచ్చాడు. తమ దేశపు గగనతలాన్ని రక్షించడంలో ఉపయోగపడే విమానాలను తమకు అందించడమే ప్రత్యామ్నాయమని కోరాడు. అంతేకాదు సోవియట్ తయారు చేసిన మిగ్-29, సు జెట్ యుద్ధ విమానాల కోసం కూడా ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విమానాలను కూల్చివేయగల సుదూర-శ్రేణి S-300 ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను పంపాలని యూఎస్ ఆలోచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed