పాలమూరు అద్భుత పర్యాటక కేంద్రంగా రూపొందిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Mahesh |   ( Updated:2023-12-17 14:54:01.0  )
పాలమూరు అద్భుత పర్యాటక కేంద్రంగా రూపొందిస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాను అద్భుత పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, టూరిజం ఎన్‌టి మనోహర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తదితర అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ చుట్టూ నిర్మించనున్న నెక్లెస్ రోడ్డు ప్రారంభానికి సంబంధించిన పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని కొత్తచెరువు నుంచి ట్యాంక్ బండ్‌కు పైప్ లైన్ ద్వారా కృష్ణా నీటిని తీసుకురావడానికి చర్యలు చేపట్టి భవిష్యత్తులో పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మినీ ట్యాంక్ బండ్ ను రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు.

ట్యాంక్ బండ్ పై కెప్టేరియా, రెస్టారెంట్లు, హోటళ్లు, తినుబండారాల ఉత్పత్తుల ఏర్పాటుతో పాటు మహిళల ఉత్పత్తులు, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో బోటింగ్ పోటీలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. శిల్పారామం, ట్యాంక్ బండ్ సుందరీకరణ, నెక్లెస్ రోడ్డు ఏర్పాటుతో పాలమూరు కు మరింత శోభ వస్తుందని మంత్రి వెల్లడించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు, వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed