అసైన్డ్ భూముల పాస్ పుస్తకాలు ఇవ్వాలని.. తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు దీక్ష

by Manoj |
అసైన్డ్ భూముల పాస్ పుస్తకాలు ఇవ్వాలని.. తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు దీక్ష
X

దిశ, జడ్చర్ల : సర్వే నెంబర్ 311 సంబంధించిన అసైన్డ్ భూములకు ప్రభుత్వం నుండి పాస్‌ పుస్తకాలను జారీ చేయాలని మిడ్జిల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు దీక్ష చేపట్టారు. మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్ కొత్తూరు గ్రామంలో ఉన్న సర్వేనెంబర్ 311లో అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల నుండి పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని ఇవ్వలేదు. ఈ కారణంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తక్షణమే పాస్ బుక్కులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మేడ్చల్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు టెంటు వేసి దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా సర్వేనెంబర్ 311 అసైన్డ్ భూములకు పాసు బుక్కులు ఇవ్వకపోవడంతో తమకు రైతు బంధు, రైతు బీమా రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలు, సబ్సిడీ విత్తనాలు పొందలేక పోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ భూములకు పట్టా పాస్బుక్కులు మంజూరు చేయాలని మండల జిల్లా అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేసిన అధికారుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 311 సర్వేనెంబర్ లోని భూములకు పాసుబుక్కులు ఇచ్చేవరకు తమ న్యాయమైన పోరాటానికి కొనసాగిస్తామని రైతులు తెలిపారు.

రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.. డిఆర్ఓ స్వర్ణలత

కొత్తూరు మల్లాపూర్ రైతుల 311 అసైన్డ్ భూముల సమస్యను ఉన్నత అధికారులతో మాట్లాడి పరిష్కరించి వాళ్ళకు పాస్ బుక్కులు జారీ చేస్తామని స్వర్ణలత తెలిపారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన రైతులతో డిఆర్ఓ స్వర్ణలత నేరుగా ఫోన్లో మాట్లాడారు. సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని రైతులను కోరారు. అక్కడ సమస్యపై చర్చించి ఉన్నత అధికారులతో సమస్య పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డిఆర్ఓ హామీ మేరకు రైతులు సాయంత్రానికి దీక్షను విరమించారు. ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించకుంటే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మల్లాపూర్ రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story