పాలేరులో ఎన్నికల సందడి.. సై అంటే సై.. అంటున్న తుమ్మల, కందాళ?

by GSrikanth |   ( Updated:2022-08-09 06:46:36.0  )
పాలేరులో ఎన్నికల సందడి.. సై అంటే సై.. అంటున్న తుమ్మల, కందాళ?
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: పాలేరు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం. ఇంకా ఎన్నికల సీజన్ మొదలే కాలేదు కానీ.. ఇక్కడ మాత్రం అన్ని పార్టీలు ఇప్పటి నుంచి తమ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. తామంటే తాము బరిలో ఉన్నామంటూ ఆశావహులు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అప్పుడే మాటల తూటాలు పేలుతున్నాయి.. నియోజకవర్గంలో నేతలు చెక్కర్లు కొడుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థుల బలాబలాలు అంచనా వేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు మొదలయ్యాయి. ఎందుకింత హాట్‌హాట్ అనుకుంటున్నారా..? ఇక్కడ అధికార పార్టీ నేతల మధ్య ఉన్న లొల్లే ప్రధాన కారణం. టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో అంటుండగా.. ఈసారి నేనూ పోటీ చేస్తున్నా అంటూ మాజీ మంత్రి.. సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అసలు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయి ఉప్పునిప్పులా ఉంది వ్యవహారం..

సై అంటే సై..

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, వారి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నియోజకవర్గంలో కనపడుతోంది. దీంతో నియోజకవర్గంలో పార్టీ ఎప్పుడో రెండు వర్గాలుగా చీలిపోయింది. అయితే ఆధిపత్యం కోసం ముందునుంచి ప్రయత్నిస్తున్న కందాలకు పార్టీ పెద్దల నుంచి కూడా సపోర్ట్ ఉన్నట్లు తుమ్మల వర్గీయులే అంటున్నారు. 2018 ఎన్నికల్లో కూడా కావాలనే తుమ్మలను ఓడించి ఆ తర్వాత కందాలను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు కొంత సైలెంట్‌గానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు సైతం పోటీలో ఉంటానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది చెప్పకపోయినా.. ఈసారి టీఆర్ఎస్ నుంచి తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. తాను సిట్టింగ్ కాబట్టి తనకే టికెట్ వస్తుందంటున్నారు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి. ఏది ఏమైనా వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ రాకపోయినా.. అది అక్కడి గెలుపోటముల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

పట్టు బిగించిన కందాల..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. గతంలో తుమ్మల పనిచేసిన అభివృద్ధి తాలూకు మార్క్ ఉండడంతో దానిని కూడా అధిగమించేందుకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పట్టుసాధించారనే టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా సరే టీఆర్ఎస్ నుంచి టికెట్ సాధించి గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా జనాల మధ్యనే ఉంటూ ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అటు అధిష్టానాన్ని కూడా ఇప్పటినుంచే టికెట్ కోసం ఒప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారని కూడా తెలుస్తోంది.

గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్న తుమ్మల..

మరో వైపు తుమ్మల సైతం పాలేరులో నిలిచి గెలిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటినుంచి పూర్తిస్థాయిలో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన ముఖ్య అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాలోచనలు చేస్తున్నారు. తమ బలాలు బలహీనలు ఏంటి..? తనకు మద్దతు ఇచ్చేది ఎవరు..? టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి..? ఆ తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి కార్యాచరణ మొదలు పెట్టాలి..? ఇలా రకరకాలుగా తన అనుచరుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతూ అందరినీ దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో మునిగిపోయారు తుమ్మల.

టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కేనా..?

వాస్తవానికి తుమ్మల, కందాల మధ్య ఆజ్యం పోసిందే టీఆర్ఎస్ అధిష్టానం అనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కందాల టికెట్ తుమ్మలకు ఇస్తారా? అనే సందేహం నియోజకవర్గ ప్రజలు, తుమ్మల అనుచరుల్లో ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకుంటే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా మెదులుతోంది. ఏదిఏమైనా తాను పోటీలో ఉంటానని, అది కూడా పాలేరు నియోజకవర్గం నుంచే అని తుమ్మల చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో కాక పుట్టించాయి. అదేవిధంగా కందాళకు కాకుండా టికెట్ తుమ్మలకు వస్తే ఏం చేయాలనే ఆలోచనలో కందాళ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయానికి ఈ ఇద్దరిలో ఒకరిటి టికెట్ ఖాయం కానుండడంతో మరొకరి ప్రయాణం ఎటు అన్నది ఇప్పటినుంచే ఆసక్తి రేకెత్తిస్తుంది.

కారు గొడవ వారికి ప్లస్ అయ్యేనా..?

నియోజకవర్గంలో తుమ్మల, కందాల మధ్య ఉన్న విభేదాలు వేరే పార్టీ వారికి అవకాశం అందిపుచ్చేలా కనిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి టికెట్ రాకపోయినా.. అవతలి వారి ప్రభావం గెలుపోటముల మీద చాలా ఉంటుందని తెలుస్తోంది. ఇదే అదనుగా ఇతర పార్టీలు పాలేరులో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల పాలేరు నుంచి పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజవర్గంలో వైఎస్ఆర్ అభిమానులుతోపాటు కాంగ్రెస్ అభిమానులూ ఎక్కువగా ఉండడంతోపాటు అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తనకు పనికొస్తుందనే ఆలోచనలో ఇక్కడినుంచి పోటీకి సై అంటున్నట్లు ప్రచారం జరగుుతోంది.. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కూడా పాలేరులో మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో కారులో కయ్యం తమకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed