- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూసగుచ్చినట్లు వివరించిన గవర్నర్.. కేసీఆర్‌పై కేంద్రం సీరియస్
తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర సీరియస్ అయ్యింది. ప్రధాని, కేంద్ర హోం మంత్రిని ఢిల్లీలో కలిసిన గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను పూసగుచ్చినట్టుగా వివరించారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అగౌరవ పర్చడం తదితర అంశాలను ప్రస్తావించారు. వీటిని శ్రద్ధగా ఆలకించిన పీఎం, కేంద్ర హోం మంత్రి సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పరిణామాలన్నింటిపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రధాని, కేంద్ర హోం మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తాజాగా చోటుచేసుకున్న డ్రగ్స్ వ్యవహారంపైనా ఒకింత ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నా విద్యా, వైద్య రంగాలు చాలా దయనీయంగా ఉన్నాయని గవర్నర్ తన నివేదికల పొందుపర్చినట్లు తెలిసింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో, ఆ తర్వాత హోం మంత్రితో భేటీ అయిన గవర్నర్ డ్రగ్స్, పొలిటికల్ కరప్షన్, ప్రొటోకాల్ ఉల్లంఘన, రాజ్‌భవన్‌కు రాజకీయ రంగు రుద్దడం తదితర వివరాలను నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. శ్రీరామనవమి పండుగకు భద్రాచలం వెళ్తున్న గవర్నర్ ఆ తర్వాతి రోజు నుంచి ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలనుకుంటున్నారు. ఇకపైన ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రజలు నిజాయితీ కలిగినవారు, అమాయకులనే భావనతో ఉన్న గవర్నర్ నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 11% జనాభాగా ఉన్న ఆదివాసీ, గిరిజన కాలనీల్లో పౌష్ఠికాహారాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపైన ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలనుకుంటున్నట్టు ప్రధాని, హోం మంత్రితో ప్రస్తావించినట్లు తెలిసింది.
డ్రగ్స్ అంశం
రాష్ట్రంలో నాలుగైదేళ్ళుగా పెరిగిపోతున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల అక్రమ రవాణా, వినియోగం, సమాజంపై వాటి ప్రభావం, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు తదితర అంశాలన్నింటినీ ఈ నివేదికలో పొందుపర్చి ప్రస్తుతం రాష్ట్రంలో పబ్‌లలో డ్రగ్స్ వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చిన వివరాలనూ అందించినట్లు తెలిసింది. డ్రగ్స్ యువతను నాశనం చేస్తున్నదని, ఒక తల్లిగా బాధపడుతూ కొన్ని సంఘటనలను ఆ నివేదికలో ఉటంకించినట్లు సమాచారం. వివిధ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులనూ ఉదహరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను ప్రధానికి, హోం మంత్రికి వివరించే టైమ్‌లో గవర్నర్ ఒకింత భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.
ప్రొటోకాల్ ఉల్లంఘనలు
రాష్ట్రంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నట్టు సమాచారం. అధికారులు గైర్హాజరవుతున్న విషయాన్ని తన నివేదికల ప్రస్తావించినట్లు తెలిసింది. గతంలో అనేక రాష్ట్రాల్లో కరుణానిధి, జయలలిత, మమతా బెనర్జీ లాంటివారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థపైనా, అప్పటి గవర్నర్లపైనా విమర్శలు, ఆరోపణలు చేశారని, కానీ ఏనాడూ గవర్నర్ పోస్టును అవమానించలేదని, ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించేవారని తమిళిసై ఈ సందర్భంగా గుర్తుచేసినట్లు తెలిసింది. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని, ఎలుకలు కొరికిన సంఘటనలతో పాటు గతంలో ప్రసవానికి వచ్చిన గర్భిణులు చనిపోవడం వరకు వివరాలను ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. విశ్వవిద్యాలయాల్లో సైతం సుమారు 60% మేర పోస్టులు ఖాళీగానే ఉన్నాయని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారన్న బలమైన భావన సిబ్బందిలో వ్యక్తమైన అంశాన్ని కూడా ఈ ఇద్దరికీ వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా గవర్నర్ హోదాలో శుభాకాంక్షలు తెలపడానికి ప్రయత్నిస్తే కనీసం టెలిఫోన్‌కు స్పందించలేదన్న ఆవేదన కూడా ఆమె మాటల్లో వ్యక్తమవుతున్నది. తన తల్లి చనిపోతే కర్టసీగా కూడా ముఖ్యమంత్రి తనను పరామర్శించలేదని, గతంలో ఒకరిద్దరితో గవర్నర్ పంచుకున్నట్లు సమాచారం. హోం మంత్రి అమిత్ షా ను గురువారం కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌గా తనకు ఉన్నప్పటికీ అలాంటి పని చేయలేనని, చేయదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంపై తనకు ఎలాంటి కోపం లేదని తెలిపారు. రాజ్‌భవన్ ఒక వ్యక్తిగా తన బంగళా కాదని, గవర్నర్ కార్యాలయమంటూ నొక్కిచెప్పిన తమిళిసై తనపైన ఏదైనా అసంతృప్తి ఉన్నా, భిన్నాభిప్రాయం ఏర్పడినా సీఎం లేదా సీఎస్ వచ్చి మాట్లాడవచ్చునని, ఆ స్వేచ్ఛ ఉన్నదని గుర్తుచేశారు.
తనకు బీజేపీ మనిషి అనే ముద్ర వేయడం తగదన్నారు. ఏనాడైనా బీజేపీ జెండాను పట్టుకున్నానా? అని ఎదురు ప్రశ్నించారు. నిజానికి బీజేపీ నేతలతో ఒకటి రెండుసార్లు మాత్రమే రాజ్‌భవన్‌లో భేటీ జరిగిందని, ఇతర పార్టీలకు చెందినవారే ఎక్కువసార్లు కలిశారని గుర్తుచేశారు. ఒక గవర్నర్‌గా రాష్ట్రంలోని అన్ని అంశాలను, పరిణామాలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో గవర్నర్‌కు విమానంలో ప్రయాణించే సౌకర్యం లేకపోవడం బాధాకరమని, తన ప్రయాణాలకు ప్రభుత్వం తరఫున ఎదురయ్యే ఆంక్షలు అడ్డంకి కాదన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, నాగర్‌కర్నూర్ జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో చెంచు గ్రామాలకు రోడ్డు మార్గం ద్వారానే వెళ్లానని, భద్రాచలం సీతారామచంద్ర స్వామి దర్శనానికీ అలానే వెళ్తానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి అనుమానం ఉంటే తనను అడిగితే వివరమైన సమాధానం చెప్తానని, సీఎస్ లేక డీజీపీగానీ లేక ఇతర అధికారులు నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చి సంప్రదించడానికి ఏం ఇబ్బంది అని ప్రశ్నించారు. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం రాకపోవడాన్ని ప్రస్తావించిన గవర్నర్ ఈ నెల 1న ఉగాది వేడుకలకు కూడా రాలేదన్నారు. ఇదేనా ప్రభుత్వం ఆచరించే మర్యాద అని ప్రశ్నించారు. సీఎం సహా అందరినీ వీటికి ఆహ్వానించానని, తగిన ఆధారాలనూ చూపిస్తానని పేర్కొన్నారు. ఒక వ్యక్తిగా తమిళిసై సౌందర్ రాజన్‌కు జరుగుతున్న అవమానం కాదని, గవర్నర్ కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు జరుగుతున్న అవమానం అని వ్యాఖ్యానించారు.